
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (63) ప్రపంచ కుబేరుల జాబితాలో శరవేగంగా దూసుకుపోతున్నారు. రిలయన్స్ టెలికాం విభాగం జియోలో వరుస భారీ పెట్టుబడులతో అంబానీ తాజాగా అత్యంత ధనవంతుల జాబితాలో 5వ స్థానానికి ఎగబాగారు. తద్వారా దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌లను వెనక్కి నెట్టేశారు.
ప్రపంచంలో టాప్ 10 బిలియనీర్స్‌లో ఏకైక ఆసియా వ్యక్తి రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కావడం విశేషం. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం 75.1 బిలియన్ డాలర్ల నికర విలువతో ముఖేష్ అంబానీ 5వ స్థానానికి చేరుకున్నారు. బర్క్‌షైర్ హాత్‌వే సీఈఓ వారెన్ బఫెట్‌ను వెనక్కి నెట్టేశారు ముఖేష్ అంబానీ. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ తర్వాతి స్థానంలో అంబానీ ఉన్నారు. మార్క్ జుకర్ బర్గ్ 88.1 బిలియన్ డాలర్ల నికర విలువతో 4వ స్థానంలో ఉన్నారు. మరోవైపు 5వ స్థానం కోసం ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అంబానీ మధ్య భారీ పోటీ నెలకొంది. టెస్లా షేర్ల ధర భారీగా పెరగడంతో మస్క్ నికర సంపద 74 బిలియన్ డాలర్లకు చేరుకుంది. (జియో మార్ట్ దూకుడు: ఉచిత డెలివరీ)
ఈ జాబితాలో 185.8 బిలియన్ డాలర్లతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ టాప్ టాప్ ప్లేస్‌లో ఉండగా, 113.1 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మూడో స్థానంలో లగ్జరీ గూడ్స్ ఎల్‌వీహెచ్ బ్రాండ్ మోయిట్ హెన్నెస్సీ ఛైర్మన్ బెర్నార్డ్ అర్నాల్ట్ ఫ్యామిలీ ఉంది. 89 బిలియన్ డాలర్ల నికర విలువతో నాలుగో స్థానంలో మార్క్ జుకర్ బర్గ్, ఆరో స్థానంలో వారెన్ బఫెట్, ఏడో స్థానంలో ఒరాకిల్ కార్పొరేషన్ ఫౌండర్ లార్రీ ఎల్లిసన్, ఎనిమిదో స్థానంలో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మర్, పదో స్థానంలో గూగుల్ కోఫౌండర్ లారీ పేజ్ ఉన్నారు
Comments
Please login to add a commentAdd a comment