ప్రపంచ సంపన్నుల్లో ముకేశ్‌ అంబానీ పదో స్థానం | Mukesh Ambani reached top 10 in terms of wealth | Sakshi
Sakshi News home page

టాప్‌10లో ము‘క్యాష్‌’!

Published Wed, Feb 27 2019 12:04 AM | Last Updated on Wed, Feb 27 2019 10:22 AM

Mukesh Ambani reached top 10 in terms of wealth - Sakshi

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ సంపద పరంగా ప్రపంచంలో టాప్‌–10కు చేరుకున్నారు. ఆయన సంపద విలువ 54 బిలియన్‌ డాలర్లు (రూ.3.83 లక్షల కోట్లు) అని హురూన్‌ ప్రపంచ సంపన్నుల జాబితా 2019 వెల్లడించింది. ముకేశ్‌ తమ్ముడు అనిల్‌ అంబానీ మాత్రం తన నికర విలువలో 65 శాతాన్ని కోల్పోయినట్టు ఈ నివేదిక తెలిపింది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఈ జాబితాలో వరుసగా రెండో ఏడాది మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 147 బిలియన్‌ డాలర్లు. ఇక హురూన్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో భారత్‌ ఐదో స్థానానికి జారినట్టు నివేదిక పేర్కొంది. రిలయన్స్‌ షేరు ఇటీవలి కాలంలో ర్యాలీ చేయడంతో మార్కెట్‌ విలువ పెరిగిన విషయం తెలిసిందే. కంపెనీలో ముకేశ్‌ అంబానీకి 52 శాతం వాటా ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్‌ విలువ రూ.7.73 లక్షల కోట్ల దగ్గర ఉంది.

మరోవైపు అనిల్‌ అంబానీ నెట్‌వర్త్‌ ఏడు సంవత్సరాల క్రితం 7 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంటే ఈ ఏడాది 1.9 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. రిలయన్స్‌ గ్రూపు వ్యాపారాలను సోదరులు ఇద్దరూ పంచుకున్న సమయంలో ఇరువురి కంపెనీల మార్కెట్‌ విలువ ఇంచుమించు ఒకే స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. ‘‘కుటుంబ సంపదను విభజించిన తర్వాత ఇద్దరూ ఒకే స్థాయిలో ప్రయాణం ఆరంభించగా.. ముకేశ్‌ అంబానీ గడిచిన ఏడేళ్ల కాలంలో 30 బిలియన్‌ డాలర్ల మేర తన సంపదను పెంచుకున్నారు. కానీ, అనిల్‌ మాత్రం ఇదే కాలంలో 5 బిలియన్‌ డాలర్లను కోల్పోయారు’’ అని హరూన్‌ నివేదిక వివరించింది. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ 96 బిలియన్‌ డాలర్లు, బెర్క్‌షైర్‌ హాత్‌వే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ 88 బిలియన్‌ డాలర్లు, ఎల్‌వీఎంహెచ్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ 84 బిలియన్‌ డాలర్లు, ఫేస్‌బుక్‌  జుకెర్‌బర్గ్‌ 80 బిలియన్‌ డాలర్లతో టాప్‌ 5లో ఉన్నారు. 

భారత్‌లో కుబేరులు...
 
ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న భారత కుబేరుల్లో... తొలి స్థానంలో ముకేశుడు ఉండగా, హిందుజా గ్రూపు చైర్మన్‌ ఎస్‌పీ హిందుజా 21 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో ఉన్న విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ సంపద 17 బిలియన్‌ డాలర్లుగా ఉంది. పూనవాలా గ్రూపు (సెరమ్‌ ఇనిస్టిట్యూట్‌) చైర్మన్‌ సైరస్‌ ఎస్‌ పూనవాలా 13 బిలియన్‌ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన ప్రపంచంలోని టాప్‌–100 సంపన్నుల్లోకి చేరినట్టు హరూన్‌ జాబితా తెలిపింది. ఆర్సెలర్‌ మిట్టల్‌ అధిపతి లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌ ఐదో స్థానంలో, కోటక్‌ మహింద్రా ఉదయ్‌ కోటక్‌ (11 బిలియన్‌ డాలర్లు), గౌతం అదానీ (9.9 బిలియన్‌ డాలర్లు), సన్‌ఫార్మా దిలీప్‌ సంఘ్వి(9.5 బిలియన్‌ డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సైరస్‌ పల్లోంజి మిస్త్రీ, షాపూర్‌జీ పల్లోంజీ మిస్త్రీ ఉభయుల సంపద 9.5 బిలియన్‌ డాలర్ల చొప్పున ఉండగా, ఇరువురు 9, 10వ స్థానాల్లో నిలిచారు. టాటాగ్రూపులో వీరికి 18.4 శాతం వాటా ఉండడం సంపద వృద్ధికి కలిసొచ్చింది.
 
మహిళా‘మణు’లు
గోద్రేజ్‌ కుటుంబంలో మూడో తరానికి చెందిన స్మితా కృష్ణ మహిళా బిలియనీర్లలో టాప్‌లో ఉన్నారు. ఆమె సంపద 6.1 బిలియన్‌ డాలర్లు. బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా 3.5 బిలియన్‌ డాలర్లతో హరూన్‌ జాబితా లో 671వ స్థానంలో ఉన్నారు. సొంతంగా సంపద సృష్టిం చుకున్న మహిళామణిగా ఆమెను హరూన్‌  పేర్కొంది.

5వ స్థానానికి జారిన భారత్‌
‘‘2012 నుంచి చూస్తే భారత్‌ మొదటిసారిగా హరూన్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో ఐదో స్థానానికి దిగజారింది. రూపాయి బలహీనత, స్టాక్‌ మార్కెట్‌ కాంతిహీనంగా ఉండటం దీనికి కారణం’’ అని హరూన్‌ రిపోర్ట్‌ ఇండియా ఎండీ అనాస్‌ రెహ్మాన్‌ జునైద్‌ తెలిపారు. జీ గ్రూపు సుభాష్‌చంద్ర, సన్‌టీవీ కళానిధి మారన్‌లకు ఈ ఏడాది ప్రతికూల సంవత్సరమని, వీరిద్దరూ గణనీయంగా సంపద కోల్పోయారని పేర్కొంది. 2018తో పోలిస్తే ఈ ఏడాది జాబితాలో సంపన్నుల సంఖ్య 224 తగ్గి 2,470కు చేరింది. ఈ 2,470 మంది ఉమ్మడి సంపద విలువ 9.5 లక్షల కోట్ల డాలర్లు. ప్రపంచ జీడీపీలో 12%కి సమానం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement