‘ఫోర్బ్స్’ కుబేరుల్లో పతంజలి ఎండీ..
* 2.5 బిలియన్ డాలర్ల సంపదతో 48వ స్థానం కైవసం
* టాప్‌లో తొమ్మిదోసారి ముకేశ్ అంబానీనే
సింగపూర్: అమెరికా బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ తాజాగా రూపొందించిన భారత్‌లోని వంద మంది అత్యంత ధనవంతుల జాబితాలో పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డెరైక్టర్, ప్రధాన వాటాదారు ఆచార్య బాల్‌కృష్ణ తొలిసారి స్థానం పొందారు. ఈయన 2.5 బిలియన్ డాలర్ల సంపదతో 48వ స్థానంలో నిలిచారు. బాల్‌కృష్ణకి పతంజలి ఆయుర్వేద్‌లో 97 శాతం వాటాలు ఉన్నాయి. కాగా జాబితాలోని మొత్తం వంద మంది సంపన్నుల సంపద 381 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.25.5 లక్షల కోట్లు) ఉంది.
ఈ సంపద గతేడాదితో పోలిస్తే (345 బిలియన్ డాలర్లు) 10 శాతం పెరిగింది. కాగా జాబితాలో స్థానం పొందాలంటే కనీసం 1.25 బిలియన్ డాలర్ల సంపద ఉండాలి.
తొమ్మిదోసారి ముకేశ్ అంబానీనే టాప్
దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరని అడిగితే ఠక్కున రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పేరు చెప్పేయచ్చు. ఫోర్బ్స్ తాజా జాబితాలో ఈయన టాప్‌లో నిలిచారు. ముకేశ్ అంబానీ ఇలా అగ్ర స్థానంలో నిలవడం ఇది వరుసగా తొమ్మిదోసారి. ఈయన సంపద 18.9 బిలియన్ డాలర్ల నుంచి 22.7 బిలియన్ డాలర్లకి చేరింది. రిలయన్స్ కంపెనీ షేరు విలువ పెరుగుదలే (21 శాతం) సంపద వృద్ధికి కారణంగా ఉంది. అంతర్జాతీయ సంపన్నుల్లో ముకేశ్ 36వ స్థానంలో ఉన్నారు. ఇక అంబానీ తర్వాత రెండో స్థానంలో సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వీ ఉన్నారు. ఈయన సంపద విలువ 16.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక హిందుజా సోదరులు ఒకస్థానం ఎకబాకి 15.2 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు. దేశీ ధనవంతుల జాబితాలో అనిల్ అంబానీ 3.4 బిలియన్ డాలర్ల సంపదతో 32వ స్థానంలో ఉన్నారు. ఈయన గతేడాది 29వ స్థానంలో ఉండేవారు.
గుజరాతీల హవా
ఫోర్బ్స్ ఇండియా జాబితాలో గుజరాతీల ఆధిపత్యం కనిపిస్తోంది. అంబానీ, అదాని, సంఘ్వీ, పటేల్.. ఇలా చాలా మంది గుజరాత్‌కు చెందిన వారు జాబితాలో అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. ముకేశ్ అంబానీ టాప్‌లో ఉన్నారు. ఇక అనిల్ అంబానీ 32వ స్థానంలో నిలిచారు. దిలీప్ సంఘ్వీ రెండో స్థానంలో, ప్రేమ్‌జీ 4వ స్థానంలో ఉన్నారు. ఉదయ్ కొటక్ 11వ స్థానంలో, గౌతమ్ అదాని 13వ స్థానంలో నిలిచారు. ఇక వీరితోపాటు పంకజ్ పటేల్, రాజేశ్ మెహ్‌తా వంటి చాలా మంది గుజరాతీలు జాబితాలో ఉన్నారు.
నలుగురు మహిళలకు చోటు
జాబితాలో నలుగురు మహిళలు స్థానం దక్కించుకున్నారు. జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ 5.3 బిలియన్ డాలర్ల సంపదతో 19వ స్థానంలో ఉన్నారు. ఈమె తర్వాతి స్థానంలో హావెల్స్ కంపెనీని స్థాపించిన దివంగత క్విమత్ గుప్తా భార్య వినోద్ గుప్తా 2.5 బిలియన్ డాలర్ల సంపదతో 46వ స్థానంలో నిలిచారు. బయోటెక్ కంపెనీ చైర్మన్ కిరణ్ మజుందార్ షా 65వ స్థానంలో (1.8 బిలియన్ డాలర్లు), యూఎస్‌వీ ఫార్మా చైర్‌పర్సన్ లీనా తివారీ 79వ స్థానంలో (1.63 బిలియన్ డాలర్లు) ఉన్నారు. వీరి మొత్తం సంపద 11.28 బిలియన్ డాలర్లుగా ఉంది.