అంబానీ ‘బ్రాడ్‌బ్యాండ్‌’ బాజా | Mukesh Ambani takes a break from big investments | Sakshi
Sakshi News home page

అంబానీ ‘బ్రాడ్‌బ్యాండ్‌’ బాజా

Published Fri, Jul 6 2018 1:13 AM | Last Updated on Fri, Jul 6 2018 5:02 PM

Mukesh Ambani takes a break from big investments - Sakshi

ముంబై: చౌక చార్జీలతో దేశీ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో... తాజాగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లోనూ అదే ట్రెండ్‌ కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా 1,100 నగరాల్లో ఇళ్లకి, సంస్థలకు జియో గిగా ఫైబర్‌ పేరిట అత్యంత వేగవంతమైన అల్ట్రా హై–స్పీడ్‌ ఫిక్స్‌డ్‌ లైన్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ప్రారంభించనుంది. గురువారం జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 41వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో గ్రూప్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. 2025 నాటికి రిలయన్స్‌ను 125 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేర్చే దిశగా భారీ ప్రణాళికలను ఆవిష్కరించారు. ‘జియో గిగాఫైబర్‌’ పేరిట అందించే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ఎప్పటినుంచి ప్రారంభించేదీ నిర్దిష్టంగా  వెల్లడించకపోయినప్పటికీ... కనెక్షన్ల కోసం ఆగస్టు 15 నుంచి రిజిస్టర్‌ చేసుకోవచ్చని చెప్పారాయన.  ‘ప్రస్తుతం వేల సంఖ్యలో ఇళ్లలో ఈ సర్వీసులను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాం. మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విభాగంలో భారత్‌ అంతర్జాతీయంగా నాయకత్వ స్థాయికి చేరినప్పటికీ, ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విషయంలో మాత్రం ఇంకా వెనకబడి ఉంది. ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో 134వ ర్యాంకులో ఉన్నాం. దీనికి సంబంధించి మన దగ్గర సరైన మౌలిక సదుపాయాలు లేవు. అదంతా ఇక మారుతుంది’ అని ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం రిలయన్స్‌ కీలక మలుపు దగ్గరుంది. ఈ స్వర్ణ దశాబ్దిలో... కంపెనీ టర్నోవర్‌లో ఇంధన, పెట్రోకెమికల్‌ వ్యాపారాల ఆదాయ వాటా ఎంత ఉంటుందో, కన్జూమర్‌ బిజినెస్‌ విభాగం వాటా కూడా ఆ స్థాయికి చేరబోతోంది‘ అని అంబానీ చెప్పారు. 2025 నాటికి భారత ఎకానమీ పరిమాణం రెట్టింపు కానున్న నేపథ్యంలో... అదే వ్యవధిలో రిలయన్స్‌ పరిమాణం కూడా రెట్టింపు స్థాయికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు.  

21 కోట్లకు జియో యూజర్లు.. 
గడిచిన ఏడాది కాలంగా జియో కస్టమర్స్‌ సంఖ్య రెట్టింపై 21.5 కోట్లకు చేరిందని, 2.5 కోట్ల జియోఫోన్లు అమ్ముడయ్యాయని అంబానీ వెల్లడించారు. అత్యంత స్వల్పకాలంలో 10 కోట్ల మంది యూజర్ల సంఖ్యను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. 2016 సెప్టెంబర్లో టెలిఫోనీ, డేటా సర్వీసులతో టెలికంలో జియో సంచలనం సృష్టించడం తెలిసిందే. దేశవ్యాప్తంగా మొబైల్, బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ సేవల కోసం డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై రిలయన్స్‌ ఇప్పటికే రూ.2,50,000 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేసింది. జియో రావడానికి ముందు దేశీయంగా డేటా వినియోగం నెలకు 125 కోట్ల జీబీగా ఉండగా... ప్రస్తుతం 240 కోట్ల జీబీలకుపైగా ఉందని అంబానీ వివరించారు.  

ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫాం ఏర్పాటు.. 
అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థలకు దీటుగా రిలయన్స్‌ కూడా ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయడంపై కసరత్తు చేస్తోంది. తమ రిటైల్‌ వ్యాపారానికి అనుబంధంగా ఇది ఉంటుందని అంబానీ చెప్పారు. ‘హైబ్రీడ్, ఆన్‌లైన్‌–టు–ఆఫ్‌లైన్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాంలో మరిన్ని వృద్ధి అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే టెక్నాలజీ ప్లాట్‌ఫాం కంపెనీగా రిలయన్స్‌ రూపాంతరం చెందుతోంది. రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్స్‌కి జియో డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సర్వీసులను అనుసంధానం చేయడం ద్వారా ఈ కొత్త ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫాం సృష్టించబోతున్నాం‘ అని ముకేశ్‌ వివరించారు.  

తుది దశలో పెట్రో పెట్టుబడులు.. 
రిలయన్స్‌ ప్రధాన వ్యాపార విభాగాలను ప్రస్తావిస్తూ.. భారీ పెట్టుబడులతో తలపెట్టిన విస్తరణ ప్రణాళికలు దాదాపు తుది దశకు వచ్చాయని అంబానీ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన పారాక్సిలీన్‌ కాంప్లెక్స్, పెట్‌కోక్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్ట్, ఆఫ్‌–గ్యాస్‌ క్రాకర్‌ ఏర్పాటు చేశామని, బుటైల్‌ రబ్బర్‌ ప్రాజెక్టు ఈ ఏడాది ప్రారంభించనున్నామని ఆయన వివరించారు. 2022 నాటికి కేజీ–డీ6 బ్లాక్‌ నుంచి రోజుకు 30–35 మిలియన్‌ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయడంపై భాగస్వామ్య సంస్థ బీపీతో కలిసి రిలయన్స్‌ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.  

జియోఫైబర్‌తో బ్రాడ్‌బ్యాండ్‌లో  విప్లవాత్మక మార్పులు.. 
రిలయన్స్‌ ప్రారంభించబోయే జియోగిగాఫైబర్‌ సర్వీసులు బ్రాడ్‌బ్యాండ్, ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేగలవని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (సీవోఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ వ్యాఖ్యానించారు. స్వల్పవ్యవధిలోనే జియో ఏకంగా 20 కోట్ల మొబైల్‌ యూజర్స్‌ను సాధించడం ప్రశంసనీయమన్నారు. కొత్త ప్రణాళికల ఊతంతో జియో టెలికం సర్వీస్‌ ప్రొవైడర్‌గా మిగిలిపోకుండా విస్తృత స్థాయి టెక్నాలజీ కంపెనీగా ఎదగగలదని కొనియాడారు.

గిగాటీవీ సెట్‌టాప్‌ బాక్స్‌ కూడా..
ఏజీఎంలో గిగాటీవీ సెట్‌టాప్‌ బాక్స్‌ను ముకేశ్‌ ఆవిష్కరించారు. పలు ప్రాంతీయ భాషల్లో వాయిస్‌ కమాండ్స్‌కి కూడా అనుగుణంగా వ్యవహరించడం దీని ప్రత్యేకత. యూజర్లు తమ టీవీ ద్వారా  మల్టీ పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్‌ నిర్వహించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. జియో గిగాటీవీ సెట్‌టాప్‌ బాక్స్‌తో 600 టీవీ చానల్స్, వేల కొద్దీ సినిమాలు, అసంఖ్యాకంగా పాటలు కూడా రిలయన్స్‌ జియో అందించనుంది. జియో గిగాఫైబర్, గిగాటీవీ సెట్‌టాప్‌ బాక్స్‌లకు కనెక్టయిన ఇతరత్రా టీవీ యూజర్లకు వీడియో కాలింగ్‌ చేసే సదుపాయం కూడా జియోటీవీలో ఉండనుంది. 1 జీబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్, 100 ఎంబీపీఎస్‌ అప్‌లోడ్‌ స్పీడ్‌తో జియో గిగాఫైబర్‌ సర్వీసులు ఉండనున్నాయి.ప్రస్తుతం చాలా మటుకు నెట్‌ సంస్థలు.. భవంతి దాకా ఒక లైను, ఆ తర్వాత బయటి నుంచి ఇంటికి మరో లైను ద్వారా ఇంటర్నెట్‌ సేవలు అందిస్తున్నాయి. దీనివల్ల స్పీడ్‌ తగ్గిపోతోందని, గిగాఫైబర్‌తో అలాంటి సమస్య లేకుండా నేరుగా ఇంటిదాకా ఒకే ఫైబర్‌తో కనెక్షన్‌ ఉంటుందని, ఫలితంగా స్పీడ్‌పరమైన కష్టాలు ఉండబోవని అంబానీ చెప్పారు. ఒకే ఫైబర్‌తో హైస్పీడ్‌ ఇంటర్నెట్, పెద్ద టీవీల్లో అల్ట్రా హై డెఫినిషన్‌ ఎంటర్‌టైన్‌మెంట్, మల్టీ–పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్, వాయిస్‌ యాక్టివేటెడ్‌ వర్చువల్‌ అసిస్టెన్స్, వర్చువల్‌ రియాలిటీ గేమింగ్, స్మార్ట్‌ హోమ్‌ సొల్యూషన్స్‌ మొదలైన సర్వీసులు జియో గిగాఫైబర్‌తో లభిస్తాయి.  

జియో ఫోన్‌ 2 .. మాన్‌సూన్‌ హంగామా.. 
క్వెర్టీ కీప్యాడ్‌ ఫీచర్‌తో రెండో తరం జియోఫోన్‌ను అంబానీ ఆవిష్కరించారు. ఇందులో వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ వంటి సైట్స్‌ను కూడా నిరాటంకంగా ఉపయోగిం చుకోవచ్చు. దీని ధర రూ.2,999. ఆగస్టు 15 నుంచి ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం రూ.1,500 రిఫండబుల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌తో అందిస్తున్న జియోఫోన్‌ విక్రయాలు కూడా కొనసాగుతాయని అంబానీ తెలిపారు. కావాలనుకుంటే రూ.501 చెల్లించి, పాత ఫీచర్‌ ఫోన్స్‌ను కొత్త జియో ఫోన్స్‌తో ఎక్సే్చంజ్‌ చేసుకోవచ్చని వివరించారు. ’మాన్‌సూన్‌ హంగామా’ పేరిట ఈ ఆఫర్‌ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, క్వెర్టీ కీప్యాడ్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్‌ మెమరీ (128 జీబీ దాకా ఎక్స్‌పాండబుల్‌), 2,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ మొదలైన ఫీచర్స్‌ జియోఫోన్‌2లో ఉంటాయి.  

ఏజీఎంలో అంబానీ కాబోయే కోడలు సందడి... 
ముకేశ్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ను పెళ్లాడనున్న కాబోయే కోడలు శ్లోకా మెహతా.. ఈసారి ఏజీఎంలో ప్రత్యేక ఆకర్షణగా నిల్చారు. ముకేశ్‌ రెండో కుమారుడు అనంత్, తల్లి కోకిలాబెన్‌ అంబానీతో కలిసి ముందువరుసలో కూర్చున్నారు. హై స్పీడ్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్, కొత్త తరం జియో ఫోన్‌ మొదలైన వాటిపై ఆకాశ్, ఆయన సోదరి ఈషా ఇచ్చిన ప్రెజెంటేషన్‌ను ఆసాంతం ఆసక్తిగా చూశారు. సమావేశం మధ్యలో.. షేర్‌హోల్డర్లతో ప్రశ్నోత్తరాల సమయంలో ఈషాతో కలిసి శ్లోకా బయటకు వెళ్లిపోయారు. బ్లూ డైమండ్స్‌ సంస్థ అధిపతి రసెల్‌ మెహతా కుమార్తె శ్లోకా... ఈ ఏడాది డిసెంబర్‌లో ఆకాశ్‌ను పెళ్లాడనున్నారు. అదే నెలలో పారిశ్రామికవేత్త అజయ్‌ పిరమాల్‌ కుమారుడు ఆనంద్‌తో ఈశా అంబానీ వివాహం కూడా ఉంది.  

డివిడెండ్లపై ప్రశ్నలు.. 
ఒక మోస్తరు డివిడెండ్లపై ఈసారి ఏజీఎంలో పలువురు షేర్‌హోల్డర్లు ప్రశ్నలు లేవనెత్తారు. వాటాదారులకు మెరుగైన రాబడులు అందించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తామని అంబానీ భరోసానిచ్చారు. ఈసారి అంబానీ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ గురించి, ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్‌ పథకాలైన డిజిటల్‌ ఇండియా వంటి వాటి గురించి గానీ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. గత ఏజీఎంలో మోదీ డిజిటల్‌ ఇండియా గురించి అంబానీ పలుమార్లు ప్రస్తావించారు.  ఏజీఎం నేపథ్యంలో గురువారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు బీఎస్‌ఈలో 2.53 శాతం క్షీణించి రూ. 965 వద్ద క్లోజయ్యింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement