రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ వాటా 12ఏళ్ల గరిష్ట స్థాయి 49.14శాతానికి చేరుకుంది. ఇటీవల ఆర్‌ఐల్ జారీ చేసిన రైట్స్ ఇష్యూలో భాగంగా ముకేశ్ కొన్ని షేర్లను సొంతం చేసుకోవడంతో కంపెనీలో వాటా పెరిగింది. ఆర్‌ఐఎల్‌కు చెందిన రూ.53,124 కోట్ల రైట్స్ ఇష్యూలో ముకేశ్ అంబానీ, ఇతర ప్రమోటర్ గ్రూప్ సభ్యులు కలిపి రూ.28,286 కోట్లు వెచ్చించి 2.25 కోట్ల షేర్లను దక్కించుకున్నారు. కంపెనీలో జూన్ 2008 నాటికి ప్రమోటర్ల వాటా 51.37 శాతంగా ఉండేది. అది 2011 సెప్టెంబర్ నాటికి 44.71శాతానికి దిగివచ్చింది. అప్పటి నుంచి ప్రమోటర్లు వివిధ రూపాల్లో క్రమంగా కంపెనీలో వాటాలను పెంచుకుంటున్నారు. రైట్స్ ఇష్యూలో భాగంగా అన్‌సబ్‌స్క్రైబ్‌డ్ పోర్షన్‌లో ప్రమోటర్ గ్రూప్ దాదాపు 50శాతం అదనపు వాటాను సొంతం చేసుకున్నట్లు రెగ్యూలేటరీ గణాంకాలు చెబుతున్నాయి.
ప్రస్తుత మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో ఒక ప్రమోటర్ తన కంపెనీలో వాటాను పెంచుకోవడం, భారీ ఎత్తున నిధులను సమీకరించడటం లాంటి అంశాలు సంస్థ భవిష్యత్తు వృద్ధిపై ప్రమోటర్ నిబద్ధతను చాటి చెబుతాయి. అలాగే ఇన్వెస్టర్లలో మరింత విశ్వాసాన్ని పెంచుతాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఛైర్మన్ రామ్‌దియో అగర్వాల్ తెలిపారు.
ఈ ఏడాది మార్చి 24న సూచీలు ఏడాది కనిష్టాన్ని తాకిన నాటి నుంచి శుక్రవారం వరకు రిలయన్స్ షేరు 82శాతం లాభపడింది. కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.10.07లక్షల కోట్లుగా ఉంది. గురువారం ఆర్‌ఐల్ పాక్షిక పెయిడ్-అప్ రైట్స్ ఇష్యూ షేర్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది.
రైట్స్ ఇష్యూలో ముకేశ్‌కు 5.52లక్షల షేర్లు:
రైట్స్ ఇష్యూలో భాగంగా కంపెనీ అధిపతి ముకేశ్ అంబానీ 5.52లక్షల ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నారు. ఈ షేర్ల కొనుగోలుతో ముకేష్ అంబానీకి వ్యక్తిగతంగా రిలయన్స్‌లో మొత్తం ఈక్విటీ షేర్ల సంఖ్య 80.52లక్షలకు చేరుకుంది. రైట్స్ ఇష్యూకు ముందు 75 లక్షల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇష్యూలో ముకేశ్ భార్య నీతా అంబానీ, పిల్లలు ఇషా, ఆకాశ్, అనంత్‌లు సైతం ఒక్కొక్కరు 5.52లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment