కంపెనీ విక్రయ వార్తలు అవాస్తవం: నాగార్జున ఫెర్టిలైజర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోరమాండల్ ఇంటర్నేషనల్ తమ సంస్థను కొనుగోలు చేయనుందంటూ వచ్చిన వార్తలను నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (ఎన్‌ఎఫ్‌సీఎల్) ఖండించింది. కంపెనీ విక్రయ వార్తలు అవాస్తవాలని తెలిపింది. కంపెనీ గానీ ప్రమోటర్లు గానీ ఇందుకు సంబంధించి ఏ సంస్థతోనూ చర్చలు జరపడం లేదని ఎన్‌ఎఫ్‌సీఎల్ వివరించింది.
తమకున్న వివిధ వ్యాపార విభాగాల్లో యూరియా కూడా ఒకటని తెలిపింది. గెయిల్ పైప్‌లైన్ ప్రమాదం కారణంగా యూరియా వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడిందని, నష్టాలు భర్తీ చేసుకునేందుకు పలు చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించింది. ప్రభుత్వం తాజాగా గ్యాస్ కేటాయింపులు జరపడంతో యూరియా ఉత్పత్తి మళ్లీ ప్రారంభించామని ఎన్‌ఎఫ్‌సీఎల్ తెలిపింది.