ఫండ్స్‌ నుంచి వైదొలగాలా..? | Mutual Fund Assets Under Management Near Rs 20 Lakh Crore | Sakshi
Sakshi News home page

ఫండ్స్‌ నుంచి వైదొలగాలా..?

Published Mon, May 22 2017 12:15 AM | Last Updated on Tue, Sep 5 2017 11:40 AM

ఫండ్స్‌ నుంచి వైదొలగాలా..?

ఫండ్స్‌ నుంచి వైదొలగాలా..?

ఈ పరిస్థితుల్లో పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్‌ తప్పనిసరి
ఆర్థిక, మార్కెట్‌ పరిస్థితులు మారితే...
ఫండ్‌ మేనేజర్‌ పనితీరూ బాగోపోతే...
ఫండ్‌లో మార్పులు జరిగి నష్టపోతే
రాబడులు లేకపోతే...


మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తుల విలువ రూ.20 లక్షల కోట్లకు చేరుతోంది. ప్రజల నుంచి భారీగా వివిధ రకాల మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి పెట్టుబడులు తరలి వస్తున్నాయి. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు అనుకూలంగా ఉండడంతో ఇన్వెస్టర్లు ఎక్కువ మంది వీటివైపు అడుగులు వేస్తున్నారు. అయితే, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేసి కూర్చుంటే కరెక్టు కాదు. పథకం ఎలా పనిచేస్తోంది? మెరుగైన రాబడులను ఇస్తోందా? అన్నది గమనిస్తూ ఉండాలి. మంచి పథకంలో పెట్టుబడి పెట్టడమే కాదు, పనితీరు బాగాలేని పథకం నుంచి తప్పుకోవడం కూడా సక్సెస్‌ సూత్రాల్లో ఒకటన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓ పథకం నుంచి ఎప్పుడు వైదొలగాలి అన్నది చెప్పేదే ఈ కథనం.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు దాదాపుగా దీర్ఘకాలిక లక్ష్యాలను ఉద్దేశించినవే ఎక్కువ శాతం ఉంటాయి. దీర్ఘకాలం కోసం అయినప్పటికీ మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని విక్రయించాల్సి రావచ్చు. లేదా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి రావచ్చు. అలాంటివి ఎప్పుడు చేయాలంటే...

 ఫండ్‌ పనితీరు బాగాలేకుంటే...
ఉత్తమ పథకాలు సైతం కొన్ని సమయాల్లో కొన్ని త్రైమాసికాల పాటు చెత్త పనితీరును చూపించొచ్చు. అందుకని మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల పనితీరు విషయంలో మూడు, ఐదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఫండ్స్‌ పేలవ పనితీరుకు కొన్ని వాస్తవిక కారణాలూ ఉండి ఉండొచ్చు. ఉదాహరణకు ఫండ్‌ పెట్టుబడి పెట్టిన రంగాల్లో ప్రతికూల పరిణామాలు ఎదురు కావచ్చు. డెట్‌ ఫండ్‌ తక్కువ నాణ్యత కలిగిన డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెట్టొచ్చు. కొన్ని సందర్భాల్లో ఫండ్స్‌ రాబడులు తీవ్ర ఆటుపోట్లకు లోనుకావచ్చు. వీటిలో కారణం ఏదైనా కానీయండి... తగిన రాబడులు ఇవ్వని పథకాల నుంచి వైదొలగి ఉత్తమ పథకాల్లోకి పెట్టుబడులు మళ్లించడం తప్పేమీ కాదు.

 ఫండ్‌ మేనేజర్‌ నిర్ణయాలు
ఫండ్‌ లక్ష్యాలను ఉన్నట్టుండి ఫండ్‌ మేనేజర్‌ మారుస్తూ నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకు లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ను మిడ్‌ క్యాప్‌ ఫండ్‌గా మార్చి కొనసాగించొచ్చు. దాన్లోకి ఇతర రంగాలను జత చేర్చుకోవచ్చు. ఈ నిర్ణయాలు రాబడులను పెంచుతున్నాయా లేక రాబడులను తగ్గిస్తున్నాయా అన్నదాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. లిక్విడిటీ (నగదు నిల్వలు) నిర్వహణ విషయంలోనూ ఇటీవలి నిర్ణయాల ప్రభావం ఉండొచ్చు. నగదు నిల్వలను తగ్గించి నిధులన్నింటినీ పెట్టుబడులుగా మార్చొచ్చు. ఈ విధమైన చర్యలు అసౌకర్యంగా అనిపించాయంటే, మీ ప్రయోజనాలకు మేలు చేకూర్చేవి కావనుకుంటే వైదొలగవచ్చు.

 ఫండ్‌ తీరులో మార్పులు
ఇన్వెస్టర్లుగా మీ చేతుల్లో లేని అంశాలూ కొన్ని ఉంటాయి. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచడానికి మొగ్గు చూపొచ్చు. అయినప్పటికీ మీ ఫండ్‌ మేనేజర్‌ మాత్రం ఇంకా దీర్ఘకాలిక మెచ్యూరిటీ బాండ్లను యాడ్‌ చేస్తూ ఉండొచ్చు. కేపిటల్‌ గూడ్స్‌ రంగం డౌన్‌ ట్రెండ్‌లో ఉంటే ఫండ్‌ మేనేజర్‌ మాత్రం అదే రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉండొచ్చు. అమెరికాలో ఇటీవల తీసుకున్న నిర్ణయాలతో ఐటీ, ఫార్మా షేర్లు ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాయి. మీరు ఇన్వెస్ట్‌ చేసిన పథకం మాత్రం ఈ రంగానికి చెందిన షేర్లలో ఎక్కువగా పెట్టుబడి పెట్టి ఉండొచ్చు. ఇలా ప్రతికూల రాబడులకు దారితీసే విధంగా ఫండ్‌ పనితీరు ఉంటే మీ నిర్ణయాన్ని సమీక్షించుకోవాల్సి ఉంటుంది.

 ఆశించిన మేర లేకుంటే...
రుణంపై ఇల్లు కొందామనుకున్నారు. మార్జిన్‌ మనీ కొంత కావాలి. అందుకోసం నిర్ణీత కాల వ్యవధి నిర్ణయించుకుని ఫండ్స్‌లో పెట్టడం ప్రారంభించారు. ఏడాదికి 12 శాతం రాబడులను అంచనా వేశారు. నాలుగేళ్ల తర్వాత ఫండ్‌ రాబడులు 10 శాతం దాటలేదనుకోండి. అప్పుడు ఆ పథకంలో పెట్టుబడులతో మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే అవుతుంది. అందుకే ఆశించిన మేర రాబడులు ఇవ్వకుంటే తగిన సమీక్ష తప్పదు.

పోర్ట్‌ఫోలియో మార్చుకునే తరుణం..
50 ఏళ్లు దాటిన తర్వాత సహజంగా ఈక్విటీల్లో పెట్టుబడులు తగ్గించుకోవాలని చెబుతుంటారు. అలాగే, మార్కెట్‌ పరిస్థితుల్లో మార్పుల కారణంగా లార్జ్‌ క్యాప్‌ షేర్లకు అనుకూల వాతావరణం నెలకొనవచ్చు. బుల్‌ ర్యాలీ కారణంగా స్వల్ప కాలంలోనే ఫండ్‌ ఎన్‌ఏవీలు బాగా పెరిగి ఉండొచ్చు. ఈక్విటీల్లో మీ పెట్టుబడులు పరిమితి దాటిపోవచ్చు. ఆయా పరిస్థితులకు అనుగుణంగా రాబడులను పెంచుకునేందుకు, రిస్క్‌ను పరిమితం చేసుకునేందుకు వీలుగా పథకాల్లోమార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంది. మీ లక్ష్యాలకు అనుగుణంగా కొన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తగ్గించుకోవడం, కొత్త ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం వంటి చర్యలు బెటర్‌.

 ఊహించని మార్పులొస్తే...
మీరు పెట్టుబడి పెట్టిన పథకాన్ని నిర్వహించే ఏఎంసీని మరో ఏఎంసీ కొనుగోలు చేయవచ్చు. మీరు ఎంచుకున్న పథకం పెట్టుబడుల తీరును కొత్త ఏఎంసీ మార్చేయవచ్చు. ఈ విధమైన మార్పులు మీకు అనుకూలం అనిపించకపోతే..? ఉదాహరణకు మీరు ఎంచుకున్న బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ అప్పటి వరకూ ఈక్విటీల్లో అధిక భాగం, డెట్‌లో తక్కువ భాగం పెట్టుబడులు పెడుతూ ఉందనుకోండి. ఉన్నట్టుండి డెట్‌లో అధిక భాగం, ఈక్విటీల్లో తక్కువకు విధానాన్ని మార్చితే... ఈ విధమైన మార్పులు మీ లక్ష్యాలను చేరుకునేందుకు అనుకూలంగా లేవనిపిస్తే వైదొలగాల్సి వస్తుంది.

ఫండ్‌ పనితీరుపై మీడియాలో వచ్చే వార్తలకూ ప్రాధాన్యం ఉంటుంది.  మీరు పెట్టుబడులు పెట్టిన  ఫండ్‌ పథకం పనితీరు గురించి మీడియాలో అదే పనిగా ప్రతికూల వార్తలు వస్తుంటే తోసిపుచ్చడం సరికాదు. అలాగే, ఫండ్‌ మేనేజర్‌ చర్యలపై సెబీ అభ్యంతరాలు, దర్యాప్తుల వంటివి చోటు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఓ ఫండ్‌ పథకం పనితీరును తీవ్రంగా ప్రభావితం చేసేవే. అయితే, వీటిని నిర్ధారించుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ ఓ ఇన్వెస్టర్‌గా వాస్తవ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఫండ్‌ పనితీరులో తేడా అనిపిస్తే బయటకు రావాలి. ఫండ్‌లో పెట్టుబడులు పెట్టడం ఎంత ముఖ్యమో అవసరమైనప్పుడు వాటిని వెనక్కి తీసుకోవడం, వైదొలిగి వేరొక పథకంలో పెట్టుబ డులు పెట్టడం ఇవన్నీ ఓ ఇన్వెస్టర్‌గా నిర్వర్తించాల్సిన బాధ్యతలు. అంత పరిజ్ఞానం లేకపోతే ఆర్థిక సలహాదారుల సూచనలు తీసుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement