ప్రభుత్వం నుంచి 25% వాటా కొంటున్న నాల్కో
కేంద్రానికి రూ.3,250 కోట్లు సమకూరే అవకాశం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అల్యూమినియం కంపెనీ నాల్కో... కంపెనీకి చెందిన 25 శాతం వాటాను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయనుంది. ఏ ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించడానికి నాల్కో కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ మరో 15 రోజుల్లో సమావేశం కానున్నదని గనుల కార్యదర్శి బల్విందర్ కుమార్ చెప్పారు. ప్రభుత్వం నుంచి 25 శాతం వాటాను కొనుగోలు చేసేలా నాల్కోకు మార్గదర్శకత్వం చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తమకు లేఖ రాసిందని పేర్కొన్నారు. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.3,250 కోట్ల నిధులు వస్తాయని అంచనా. నాల్కోలో 10 శాతం వాటా విక్రయం ద్వారా రూ.1,300 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం గతంలో భావించింది. కానీ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు.