అప్పుడు మావాళ్ల మాట వినాల్సింది
ఇన్ఫీ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి
న్యూఢిల్లీ: దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ‘ఇన్ఫోసిస్’ చైర్మన్ పదవి నుంచి వైదొలగడంపై ఆ కంపెనీ సహవ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్.ఆర్.నారాయణ మూర్తి ఇప్పుడు విచారం వ్యక్తంచేశారు. అప్పుడు కంపెనీ ఇతర సహవ్యవస్థాపకులు తనను పదవిలో కొనసాగాల్సిందిగా కోరారని, వారి మాట విని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా ఇన్ఫోసిస్ చైర్మన్ పదవి నుంచి మూర్తి 2014లో తప్పుకున్నారు. ‘నా రాజీనామా నిర్ణయాన్ని కంపెనీ ఇతర సహ వ్యవస్థాపకులు వ్యతిరేకించారు.
కంపెనీ నుంచి వెళ్లిపోవద్దని, మరికొన్నేళ్లు కంపెనీకి సేవలు అందించాలని కోరారు. కానీ నేను వారి మాట వినలేదు’ అని వ్యాఖ్యానించారు. ‘నాకు సాధారణంగా భావోద్వేగాలు ఎక్కువ. నా నిర్ణయాలు ఎక్కువగా ఐడియలిజంపై ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ బహుశా నేను వారి మాట వినాల్సింది’ అని సీఎన్‌బీసీ టీవీ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా కార్పొరేట్ గవర్నెన్స్, సిక్కా వేతన ప్యాకేజ్, మాజీ ఉద్యోగులకు చెల్లింపులు వంటి అంశాలకు సంబంధించి ఇన్ఫోసిస్ మేనేజ్‌మెంట్ నిర్ణయాలపై మూర్తి విమర్శలు చేసిన విషయం తెలిసిందే.