మోదీది అద్భుతమైన ఆలోచన | Narendra Modi's competitive cooperative federalism idea brilliant: Narayana Murthy | Sakshi
Sakshi News home page

మోదీది అద్భుతమైన ఆలోచన

Published Wed, Aug 16 2017 12:55 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

మోదీది అద్భుతమైన ఆలోచన - Sakshi

మోదీది అద్భుతమైన ఆలోచన

‘ఇన్ఫీ’ నారాయణమూర్తి
‘పోటీతో కూడిన సమాఖ్య విధానాని’కి ఆహ్వానం
పెట్టుబడుల్లో రాష్ట్రాలు పోటీ పడతాయని అభిప్రాయం


బెంగళూరు: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపును ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి స్వాగతించారు. ‘‘దేశాభివృద్ధికి రాష్ట్రాలు చాలా కీలకం. నేను ముఖ్యమంత్రిగా చాలా కాలంగా ఉండడంతో నాకీ విషయం తెలుసు. ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతను నేను అర్థం చేసుకోగలను. అందుకే మేము సహకారాత్మక సమాఖ్య విధానంపై దృష్టి సారించాం. ఇప్పుడు పోటీతో కూడిన సహకారాత్మక సమాఖ్య విధానం’ అనుసరిస్తున్నాం.

 అన్ని నిర్ణయాలను కలసి కట్టుగా తీసుకుంటున్నాం’’ అని ప్రధాని 71వ స్వాతంత్యదినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన సినర్జెటిక్‌ సెక్యూరిటీ ఆపరేషన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నారాయణమూర్తి ప్రధాని వ్యాఖ్యలపై స్పందించారు. ‘పోటీపడగల సహకారాత్మక సమాఖ్య విధానం’ అన్నది గొప్ప ఆలోచనగా అభివర్ణించారు. ప్రధాని పిలుపులోని పోటీతత్వం అనేది పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విషయంలో రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీపడేలా చేస్తుందన్నారు.

 దీనివల్ల మరిన్ని ఉద్యోగాలు ఏర్పడతాయని మూర్తి అభిప్రాయపడ్డారు. నిరక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం తదితర ఎన్నో అంశాల్లో కేంద్రాన్ని నిందించకుండా, వాటిపై పోరాడేందుకు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో కలసి నడవాలని సూచించారు. నల్లధనం, జీఎస్టీ అంశాలపైనా మూర్తి స్పందించారు. ‘‘పెద్ద నోట్ల రద్దుతో రూ.1.25 లక్షల కోట్ల నల్లధనాన్ని వెలుగులోకి తీసుకొచ్చి, తొలగించినట్టు ప్రధానే చెప్పారు. ఈ విషయంలో మనం ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. జీఎస్టీతో వ్యాపారులు, ప్రభుత్వానికి ప్రయోజనాలు అందడం మొదలైంది’’ అని మూర్తి చెప్పారు. షెల్‌ కంపెనీలపై ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని కూడా ఆయన సమర్థించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందన్నారు.

పొదుపు చర్యలు పాటించడం ద్వారానే కంపెనీలు వృద్ధి చెందగలవని నారాయణ ముర్తి చెప్పారు. ‘సంపాదించే దానికన్నా తక్కువ ఖర్చు చేయడం చాలా ముఖ్యం. కంపెనీలు మరింత వృద్ధిలోకి రావాలంటే చైర్మన్, సీఈవోల నుంచి కాపలాదారు దాకా అందరూ పొదుపు చర్యలు పాటించాలి. నిరాడంబరంగా ఉండాలి‘ అని ఆయన సూచించారు. ఖర్చు చేసే ప్రతి పైసాకు తగిన విలువను కంపెనీ రాబట్టుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.   

విధానాల్లో సంస్కరణలు కావాలి
ఉద్యోగ కల్పన, మహిళా సాధికారత అవసరం
పారిశ్రామిక సంఘాల పిలుపు


న్యూఢిల్లీ: నూతన పారిశ్రామిక విధానంతోపాటు విధానాల్లో బలమైన సంస్కరణలు, ఉద్యోగాల కల్పన, పని ప్రదేశాల్లో మహిళా సాధికారత పెంచాల్సిన అవసరం ఉందని భారత పరిశ్రమ సమాఖ్య (సీఐఐ) కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అవినీతి, నల్లధనంపై కేంద్ర ప్రభుత్వ చర్యల్ని ప్రశంసించింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు కనిష్ట స్థాయికి దిగిరావడాన్ని ఆహ్వానించింది. 2022 నాటికి సురక్షిత, సుసంపన్న, బలమైన భారత్‌ను ఆవిష్కరించాలన్న ప్రధానమంత్రి విధానంపై సీఐఐ ప్రెసిడెంట్‌ శోభన కామినేని స్పందించారు.

‘2022 నాటికి అభివృద్ధి విధానం’ అన్నది కష్టమైనదని, దీన్ని సాధించేందుకు పలు ఆర్థిక, సామాజిక రంగాల్లో బలమైన, విధానపరమైన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ, వ్యాపార సులభతర నిర్వహణ దేశ ఆర్థిక రంగాన్ని మరింత వ్యవస్థీకృతం చేస్తాయని, పన్ను పరిధి పెరుగుతుందని శోభన పేర్కొన్నారు. 2022 నాటికి మరింత పారదర్శక, సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థను ఆశిస్తు న్నట్టు చెప్పారు. బలమైన, ఆర్థిక అవకాశాలతో కూడిన, అవినీతి రహిత దేశాన్ని ప్రధాని ఆవిష్కరించినట్టు ఫిక్కీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement