![మోదీ సంస్కరణల స్పీడ్ అంతంతే!](/styles/webp/s3/article_images/2017/09/3/61458761151_625x300.jpg.webp?itok=taiK6H0p)
మోదీ సంస్కరణల స్పీడ్ అంతంతే!
♦ చైనా అధికారిక ఆంగ్ల దినపత్రిక గ్లోబల్ టైమ్స్ తాజా వ్యాసం
♦ ప్రపంచానికి భారత్ ‘గ్రోత్ ఇంజిన్’ కాలేదు
బీజింగ్: చైనా అధికారిక ఆంగ్ల వార్త దిన పత్రిక.. గ్లోబల్ టైమ్స్ మరోసారి భారత్ ఆర్థిక వ్యవస్థపై తనదైన శైలిలో విశ్లేషణ చేసింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వ సంస్కరణల స్పీడ్ అంతంతేనని ఒక వ్యాసంలో పేర్కొంది. భారత్ ‘ప్రపంచ ఆర్థిక చోదక’ శక్తిగా అవతరించే అవకాశం ఇప్పట్లో కనబడ్డంలేదని పేర్కొంది. భారత్‌తో పోల్చితే చైనా ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు ఎక్కువని వివరించింది. అయితే భారత్ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా, స్థిరంగా వృద్ధి చెందుతోందని తెలిపింది. వృద్ధికి సంబంధించి ఇతర దక్షిణ ఆసియా దేశాలతో పోల్చితే భారత్ తనకు తగిన బాటను ఎంచుకుందని కూడా విశ్లేషించింది. భారత్ ఆర్థిక వ్యవస్థను పశ్చిమదేశాల మీడియా గొప్పచేసి చూపెడుతోందని, అయితే చైనా ఎకానమీకి భారత్ ఎన్నడూ సరికాదని గ్లోబల్ టైమ్స్ ఇటీవలే పేర్కొంది. పలు సామాజిక, ఆర్థిక సమస్యలను భారత్ ఎదుర్కొంటోందని విశ్లేషించింది.
ఇన్వెస్టర్లు అన్నీ గమనిస్తారు
భారత్ వృద్ధి ధోరణిని కొండంతలుగా చూపెడుతూ భారత్ అధికారులు, పశ్చిమదేశాల మీడియా... చైనా నుంచి భారత్‌కు పెట్టుబడులు తరలేటట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తాజాగా వార్తాపత్రిక పేర్కొంది. అయితే ఇలాంటి చర్యల వల్ల ఫలితం పరిమితంగానే ఉంటుందని పేర్కొంది. పెట్టుబడులకు తగిన ప్రతిఫలాన్ని కోరుకునే ఇన్వెస్టర్లు ఎక్కడ తమ లావాదేవీల వ్యయం తక్కువగా ఉందన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తుంటూనే ఉంటారని పేర్కొంది. చైనా ఆర్థికవృద్ధి... భారత్ ఆర్థికవృద్ధి ఒకదానితో ఒకటి పోల్చడం సరికాదని పేర్కొన్న పత్రిక అయితే దీనికి బదులు రెండు దేశాలూ ఒకదానితో మరొకటి అనుభవాలను పంచుకుంటూ ముందుకు కదలాల్సి ఉంటుందని సూచించింది. చైనా వృద్ధికి ఒక స్థిర నమూనా అంటూ ఏదీ లేదని వివరించింది.
కనుక ఇక్కడ ‘పోలిక’ ప్రశ్నే తలెత్తబోదని అభిప్రాయపడింది. అయితే 60 సంవత్సరాల ఆర్థికపథంలో చైనా సైతం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుందని తెలిపింది. అయినా పలు రంగాల్లో విజయం సాధించగలిగిందని వివరించింది. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఊపును అందించడానికి అధికారంలోకి వచ్చిననాటి నుంచీ మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ, సంస్కరణల బాటలో ముందుకు సాగింది స్వల్పమేనని వివరించింది. భారత్‌లో రాజకీయ వ్యవస్థలే భారత్ ఆర్థిక సంస్కరణలకు అవరోధంగా పేర్కొంది. పార్టీల మధ్య ఉండే పోటీ... విధాన నిర్ణయాల అమలుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటుందని పేర్కొంది. అయితే భారత రాజకీయ వ్యవస్థ గొప్పతనాన్ని వ్యాసం అంగీకరించింది.