లిస్టింగ్కు ఎన్ఎస్ఈ రెడీ...
♦ వచ్చే జనవరి కల్లా ఐపీఓ పత్రాల దాఖలు
♦ విదేశీ ఎక్స్ఛేంజీల్లోనూ లిస్టింగ్‌కు అవకాశం...
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు రానుంది. భారత్‌తో పాటు విదేశాల్లోని స్టాక్ మార్కెట్లలో కూడా లిస్టింగ్ కావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. దేశీయ లిస్టింగ్ కోసం ఐపీఓ ముసాయిదా పత్రాలను వచ్చే ఏడాది జనవరి కల్లా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పిస్తామని తెలియజేసింది. విదేశాల్లో లిస్టింగ్ కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా సంబంధిత పత్రాలను సమర్పిస్తామని, లిస్టింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం ప్రస్తుతమున్న లిస్టింగ్ కమిటీని పునర్‌వ్యవస్థీకరించామని, ఈ కమిటీ నిర్దేశిత గడువులో నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపింది.
అయితే సెల్ఫ్ లిస్టింగ్ ఆప్షన్, క్రాస్-లిస్టింగ్ ఆప్షన్‌లకు సంబంధించిన స్పష్టతను ఎన్‌ఎస్‌ఈ ఇవ్వలేదు. ఈ విషయాలకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఎన్‌ఎస్‌ఈ బోర్డ్ కమిటీ మదింపు చేస్తుందని పేర్కొంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ వ్యాపార పునర్వ్యస్థీకరణకు ప్రయత్నాలు చేస్తోంది. నియంత్రణలో లేని పోర్ట్‌ఫోలియో వ్యాపారం కోసం ఒక ప్రత్యేకమైన కంపెనీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇక అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడం వల్ల ఎక్స్ఛేంజ్ విలువలో పారదర్శకత చోటుచేసుకుంటుందని అంచనా. మరో స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్‌ఈ ఇప్పటికే ఐపీఓ ప్రక్రియ మొదలు పెట్టింది. త్వరలో ఐపీఓ ముసాయిదా పత్రాల(డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్)ను సెబీకి సమర్పించనుంది.