
ఆలిండియా బ్యాంకర్ల సమ్మె సైరన్
చెన్నై: బ్యాంకు సంఘాలు మరోసారి సమ్మెకు దిగనున్నారు. బ్యాంకింగ్ రంగం, ఇతర అంశాలపై ఇటీవలి సంస్కరణలను నిరసిస్తూ ఆగస్టు 22 న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నామని బ్యాంకు సంఘాలు ప్రకటించాయి. ముఖ‍్యంగా ప్రయివేటైజేషన్, ప్రభుత్వ రంగబ్యాంకుల విలీనం తదితర చర్యలకు వ‍్యతిరేకంగా బ్యాంకు యూనియన్లు సమ్మె సైరన్ మోగించాయి.
ఈనెల 22వ తేదీన ఆలిండియా బ్యాంకర్ల సమ్మె తలపెట్టినట్లు ద యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బీయు), ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌లు ప్రకటించాయి. ఆగస్టు 22 న మొత్తం బ్యాంకింగ్ రంగంపై సమ్మె జరుగుతుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబీఇఎ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు చెప్పారు. వేతనాలు పెంపుతోపాటు బ్యాంకింగ్ రంగ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ సమ్మెకు దిగనున్నామని చెప్పారు. దీనిపై రెండు రోజుల క్రితమే నోటీసులు అందజేశా మన్నారు. బ్యాంకింగ్ రంగంలో తొమ్మిది యూనియన్లతో కూడిన యుఎఫ్‌బీయు ఈ సమ్మెలో పాల్గొంటోందని అలాగే వేతనం సమీక్షలాంటి , ఇతర సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను కూడాకోరినట్టు వెంకటాచలం తెలిపారు.