ఆ కారణాలతోనే పతనం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. సోమవారం ఉదయం ఫ్లాట్ గా మొదలైన మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో శుక్రవారం ప్రకటించిన రిలయన్స్ ఫలితాలతో మార్కెట్ పుంజుకుంటుందని భావించిన ఇన్వెస్టర్లు నిరాశకు లోనయ్యారు. ఆసియన్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, దేశీయ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్, పెట్టుబడుల నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గడంతో మిడి సెషన్ లో 240 పాయింట్లకు పైగా కోల్పోయింది. ప్రధానంగా ఆయిల్, బ్యాంకింగ్ , ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగ షేర్లు నష్టాల్లో ముగిసాయి. హిందాల్కో, ఎన్టీపీసీ, మారుతి, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాలను చవిచూశాయి. అయితే చివరలో కొద్దిగా కోలుకుని సెన్సెక్స్ 159 పాయింట్ల నష్టంతో 25,678దగ్గర , నిఫ్టీ 44 పాయింట్ల నష్టంతో 7,855 దగ్గర క్లోజ్ అయింది.
ఒక వైపు మార్కెట్ దిగ్గజం రిలయన్స్ మెరుగైన ఫలితాలను నమోదు చేసినా మార్కెట్ లో ఆ షేర్ పతనం ఇన్వెస్టర్లను గందరగోళంలో పడేసింది. మరోవైపు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెరగనున్నాయనే అంచనాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో మన మార్క్టెట్లు పతనం దిశగా పయనించాయి. ఈ నెల 27-28 లలో జరగనున్న పెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు భారత్ సహా, వివిధ దేశాల్లో ఆయిల్ ధరల పతనం, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్యపరపతి విధానం సమీక్ష నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. లాభాల స్వీకరణ, లాంగ్ పొజిషన్ల నుంచి పెట్టుబడిదారుల ఉపసంహరణ లాంటి అంశాలు మార్కెట్లను నష్టాల్లోకి లాక్కెళ్లాయి. ఇది ఇలా వుంటే ఈక్విటీ మార్కెట్ల పతనంతో పసిడి ధరలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.