అరకు కాఫీపై నెస్లే ఆసక్తి
♦ ప్రయత్నాలు చేశాం; కానీ ఫలించలేదు
♦ డిమాండ్ పెరిగితే మళ్లీ పరిశీలిస్తాం
♦ నెస్లే నంజన్‌గుడ్ ప్లాంటు ఇన్‌చార్జ్ వ్యాఖ్యలు
♦ 200 కోట్లతో కాఫీ ప్లాంటుకు మెరుగులు
సాక్షి, బిజినెస్ బ్యూరో : డిమాండ్‌ను బట్టి ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి కూడా కాఫీ గింజలు సేకరించాలని ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే యోచిస్తోంది. అలాగే ఉత్పత్తిని మెరుగుపర్చుకునే దిశగా కర్ణాటకలోని నంజన్‌గుడ్ కాఫీ ప్లాంటును రూ.200 కోట్లతో ఆధునీకరిస్తోంది కూడా. కాఫీ, నూడుల్స్ ప్లాంట్ల సందర్శన సందర్భంగా కంపెనీ అధికారులు విలేకరులకు ఈ విషయాలు చెప్పారు. ‘‘అరకు కాఫీ గింజల కొనుగోలు కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేశాం. కాకపోతే మా ప్రమాణాల ప్రకారం నాణ్యత ఉండాలి. ఈ విషయంలో అప్పుడప్పుడూ తిరస్కరణలు కూడా ఉంటాయి. వాటిపై స్థానికులకు కొన్ని సందేహాలు, భయాలు ఉండటంతో మా ప్రయత్నాలు ఫలించలేదు’’ అని ప్లాంటు ఇన్‌చార్జ్ నిర్మల షాపూర్కర్ పేర్కొన్నారు.
కాకపోతే పెరిగే డిమాండ్‌ను బట్టి వారు ముందుకొస్తే అరకు నుంచి సమీకరించే అవకాశాలు లేకపోలేదని ఆమె వ్యాఖ్యానించారు. 2015-16లో దేశవ్యాప్తంగా సుమారు 3.48 లక్షల టన్నుల మేర, ఆంధ్రప్రదేశ్‌లో 9,200 టన్నుల మేర కాఫీ గింజల ఉత్పత్తి జరిగింది. నెస్లే ప్రస్తుతం దక్షిణాదిలో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కాఫీ గింజలు సమకూర్చుకుంటోంది. ఈ ఏడాది ఉత్పత్తి కొంత త గ్గే అవకాశాలున్నా... ధర మాత్రం ప్రస్తుత స్థాయిలోనే కొనసాగవచ్చని నిర్మల చెప్పారు. ప్రస్తుతం తమ కాఫీ ప్లాంటు వార్షికంగా 15,000 టన్నుల కాఫీ గింజలు ప్రాసెసింగ్ చేస్తుండగా... నూడుల్స్ ప్లాంటులో 45,000 టన్నుల మేరకు ఉత్పత్తి జరుగుతోందని వివరించారు.
నంజన్‌గుడ్ ప్లాంటు సుమారు 70-80 శాతం సామర్ధ్యంతో పనిచేస్తోందని, దాదాపు 25 మంది తమకు కాఫీ గింజల సరఫరా చేస్తున్నారని చెప్పారామె. నూడుల్స్‌కు సంబంధించి ఇటీవలే ఆవిష్కరించిన నాలుగు కొత్త వేరియంట్లను త్వరలో తెలంగాణ, ఏపీల్లో నెస్లే పూర్తి స్థాయిలో విక్రయించనుంది. నూడుల్స్ తయారీలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 8,000 పైచిలుకు ఉద్యోగులు ఉండగా.. నంజన్‌గుడ్ ఫ్యాక్టరీలో 500 మంది పైగా సిబ్బంది ఉన్నట్లు తెలిపారు.
రైతులకు తోడ్పాటు..
స్వల్ప వ్యయాలతో అధిక దిగుబడులు పొందేలా నెస్ కెఫే ప్లాన్ కార్యక్రమం కింద స్థానిక రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు నెస్లే వర్గాలు పేర్కొన్నాయి. నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తికి సంబంధించిన సుమారు 500 పైచిలుకు రైతులకు 4సీ సర్టిఫికేషన్ లభించేలా తోడ్పడినట్లు తెలిపాయి. త్వరలో ఈ సంఖ్యను వెయ్యి దాకా పెంచుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. మరోవైపు కార్పొరేట్ సామాజిక కార్యక లాపాల కింద వరి, చెరకు రైతులకు కూడా శ్రీవరి తదితర మెరుగైన సాగు పద్ధతుల్లో శిక్షణను కల్పిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన అగ్‌శ్రీ సంస్థ తోడ్పాటు అందిస్తోంది.