స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త హీరోలు!!
♦ వివో, ఒప్పొ, జియోనీ దూకుడు
♦ 21-27 శాతానికి పెరిగిన మార్కెట్ వాటా
♦ తక్కువ ధర, నాణ్యత, ఎక్కువ ఫీచర్లే కారణం
♦ శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్ స్పీడ్‌కు బ్రేకులు
సాక్షి, బిజినెస్ విభాగం : స్మార్ట్‌ఫోన్ యూజర్లలో మార్పొస్తోంది. ఎక్కువ ఫీచర్లు, తక్కువ ధరకుతోడు ఫిర్యాదులు లేని బ్రాండ్లకు సై అంటున్నారు. ఈ అంశమే ఇప్పుడు చైనా కంపెనీలైన వివో, ఒప్పొ, జియోనీలకు కలిసొచ్చింది. ఫలితం!! వీటి మార్కెట్ వాటా వేగంగా పెరుగుతోంది. మార్చితో పోలిస్తే జూన్ త్రైమాసికంలో ఇవి తమ వాటాను 21 నుంచి 27 శాతానికి పెంచుకున్నాయి. చైనాలో మాదిరిగా భారత్‌లోనూ వీటి వ్యూహం ఫలితంగా ఎప్పటి నుంచో మార్కెట్ లీడర్లుగా కొనసాగుతున్న కంపెనీల పునాదులకు బీటలు పడుతున్నాయి.
జెట్ స్పీడ్‌లో చైనా బ్రాండ్లు..
వివో, ఒప్పొ, జియోనీ, హువావే, లెనోవో వంటి చైనా కంపెనీ లు భారతీయ స్మార్ట్‌ఫోన్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒప్పొ, వివో సంస్థలు ప్రపంచ టాప్-5 మొబైల్ హ్యాం డ్‌సెట్స్ కంపెనీల్లో స్థానం పొందాయి. ఇవి దేశంలోని టాప్-3 స్మార్ట్‌ఫోన్ కంపెనీలైన శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్‌కు గట్టి పోటీనిస్తున్నాయి. దీనికి స్టోర్లలో బ్రాండింగ్, రిటైల్ మార్జిన్ చెల్లింపులు, ఫీచర్లు, నాణ్యత వంటి అంశాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. రూ.25 వేలు, ఆపైన ధరలో ఉన్న చైనా కంపెనీల మోడళ్లను కూడా కస్టమర్లు ఆదరిస్తున్నారని మొబైల్స్ రిటైల్ చైన్ టెక్నోవిజన్ చెబుతోంది. జూన్ త్రైమాసికంలో వివో 201%, జియోనీ 99, ఒప్పొ 42, లెనోవో 23, షావొమీ 23% వృద్ధి చెందాయని కౌంటర్ పాయింట్ చెబుతోంది.
వాటా 27 శాతానికి జంప్..
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వివో, ఒప్పొ, జియోనీ, లెనోవో సంస్థల దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటా పెరిగింది. జనవరి-మార్చితో పోలిస్తే ఏప్రిల్-జూన్‌లో ఈ కంపెనీల మార్కెట్ వాటా 21 శాతం నుంచి 27 శాతానికి ఎగసింది. దీనికి ఆయా కంపెనీల రిటైల్ మార్కెటింగ్ వ్యూహాలు, బ్రాండింగ్ విధానాలు బాగా అనుకూలించాయి. వివో ఐపీఎల్ స్పానర్‌గా వ్యవహరించింది. ఇక ఒప్పొ ఐసీసీ టీ20 వరల్డ్ కప్, బిగ్‌బాస్, ఐపీఎల్‌లకు స్పాన్సర్‌షిప్స్ డీల్స్‌ను కలిగి ఉంది. అలాగే ఈ కంపెనీలు రిటైలర్లకు ఆఫర్ చేస్తోన్న మార్జిన్ చెల్లింపులు 5-6 శాతం శ్రేణిలో ఉన్నాయి. ఇవి మిగతా ప్రధాన కంపెనీలు ఆఫర్ చేసే విలువ కన్నా ఎక్కువ. క్రెడిట్‌పైన మొబైళ్లను సరఫరా చేస్తుండడంతో ఈ కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలపైనే చిన్న రిటైలర్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.
ప్రధాన కంపెనీల వాటా దిగువకు..
దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లీడర్‌గా ఉన్న కొరియా దిగ్గజం శాంసంగ్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. చైనా కంపెనీల దెబ్బకు దీని మార్కెట్ వాటా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 29 నుంచి 25.6%కి తగ్గింది. ఇక దేశీ కంపెనీ మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్‌లూ భారీ పతనాన్నే చూస్తున్నాయి. మైక్రోమ్యాక్స్ వాటా 17 శాతం నుంచి 14 శాతానికి దిగిరాగా... ఇంటెక్స్ వాటా 10% నుంచి 8.5%కి పరిమితమైంది. రూ.20,000లోపు ధర విభాగంలో వివో, ఒప్పొ, జియోనీ కంపెనీలదే హవా అని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సీనియర్ టెలికం అనలిస్ట్ తరుణ్ పాఠక్ తెలిపారు.
వ్యూహాత్మకంగా చైనా బ్రాండ్లు..
చైనా కంపెనీలు దేశంలో వాటి దీర్ఘకాలిక లక్ష్యాలకు అనువుగా పెట్టుబడి పెడుతున్నాయి. ఇవి ప్రధానంగా కస్టమర్ సర్వీసులపై దృష్టి కేంద్రీకరించాయని ఆల్ ఇండియా మొబైల్ రిటైల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. వివో, ఒప్పొ, జియోనీ సంస్థలు ప్రొడక్ట్ నాణ్యతలో రాజీపడటం లేదన్నారు. ఈ కంపెనీల మోడళ్లపై కస్టమర్ల ఫిర్యాదులు లేవని టెక్నోవిజన్ ఎండీ సికందర్ చెప్పారు. పైగా అధిక ఫీచర్లున్న మోడళ్లు తక్కువ ధరకు వస్తున్నాయన్నారు. చైనా కంపెనీలు హై ఎండ్ ఫీచర్లతో కూడిన ఫోన్లను అందుబాటు ధరల్లో యూజర్లకు అందిస్తున్నాయని గార్ట్‌నర్ ఇండియా రీసెర్చ్ డెరైక్టర్ అన్సూల్ గుప్తా పేర్కొన్నారు.