న్యూఢిల్లీ: ఇకపై వార్షికంగా రూ.50 లక్షల పైగా ఆదాయమున్న వారు తప్పనిసరిగా ఖరీదైన ఆభరణాలు, ఎయిర్‌క్రాఫ్ట్ మొదలైన ఆస్తుల వివరాలు వెల్లడించాల్సి రానుంది. ఈ మేరకు 2016-17 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను విభాగం కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫారంలను నోటిఫై చేసింది. వీటి ప్రకారం రూ. 50 లక్షలు దాటిన వార్షికాదాయం గల వారిని ఉద్దేశించి ఐటీఆర్‌లలో (ఐటీఆర్-2, 2ఏ) ప్రత్యేకంగా ‘సంవత్సరాంతాన ఆస్తులు, అప్పులు’ పేరిట కాలమ్‌ను పొందుపర్చింది.
స్థలం, భవంతులు వంటి స్థిరాస్తులను ఎలాగూ కొత్త ఐటీఆర్‌లో వెల్లడించాల్సి ఉన్నా.. ఇకపై చేతిలో ఉన్న నగదు, ఆభరణాలు, బంగారం, వాహనాలు, యాట్స్, బోట్లు, విమానాలు వంటి చరాస్తులన్నింటి గురించీ చెప్పాల్సి వస్తుంది. ఇది సుమారు 1.5 లక్షల మంది అత్యంత సంపన్నులపై మాత్రమే ప్రభావం చూపుతుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్‌ముఖ్ అధియా చెప్పారు.