మారుతోన్న వంటిల్లు
ఆధునాతన హంగులు.. అందమైన అలంకరణ
సాక్షి, హైదరాబాద్: కాలం మారుతోంది. దానికి అనుగుణంగానే అభిరుచులు కూడా మారుతున్నాయి. ఇంటిని ఎంత అందంగా నిర్మించుకోవాలనుకుంటున్నారో అంతే అందంగా వంటిళ్లు, పడకగది తదితర వాటిని ఉంచుకోవాలనుకుంటున్నారు. దీనికి తగ్గట్టు గతంలో మాదిరిగా టేకు, ఫ్లయివుడ్, డెకోలానికి కాలం చెల్లింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎండీఎఫ్, (మీడియం డెనిసిట్ ఫైబర్), మరిన్ ఫ్లయ్ (వంద శాతం నీటిని తట్టుకునే రకం) వచ్చేశాయి. ఇందులో పలు రంగులుంటాయి. అభిరుచిని బట్టి ఇంటి మొత్తాన్ని అరలతో మార్చేస్తారు. తక్కువ స్థలంలో ఎక్కువ సామాను పట్టేలా, అది కూడా ఆకర్షణీయంగా ఎక్కడికక్కడ అమరుస్తారు. ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాలు సైతం కిచెన్‌తో పాటు ఇంటీరియల్ డెకరేషన్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఆసక్తి, అభిరుచులకు తగ్గుట్టుగా పలురకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. రూ.50 వేల నుంచి రూ.50 లక్షల వరకు వంటిళ్లు, పడక గదిలో అరలు ఏర్పాటు చేసుకోవచ్చు. ధరలను బట్టి సామాగ్రి మారుతుంటుంది. గత ఐదేళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు నిర్మించే ప్రతి ఇంట్లోనూ అధునాత వంటిళ్లు, పడకగది, ఇంటీరియర్ డెకరేషన్ చేయిస్తున్నారు. స్థాయిని బట్టి వంటిళ్లును మార్చుకునేందుకు వీలుండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.
అధునాతన సౌకర్యాలు..
వంటింటిలోని సామాగ్రి బయట కనబడకుండా, సులువుగా తీసుకునేలా రూపుదిద్దుతున్నారు. వంటింట్లో ప్రధానమైన గ్యాస్ స్టవ్‌ను మార్చేస్తున్నారు. ఇందులో రూ.9 వేల నుంచి మొదలుకొని రూ.25 వేల వరకు ఉన్నాయి. దీంతో వంట సమయంలో పొగబయటకు రాదు. దీంతో పాటు వంట సామాగ్రి చెంచాలు, కప్పులు, ప్లేట్లు వేర్వేరుగా పెట్టుకునేందుకు అరలను అమరుస్తారు. ఇందులో ఏ ఒక్కటి బయటకు కనబడదు. వంటింట్లో ఏమాత్రం స్థలాన్ని వృథా పోనీయకుండా అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. లిమెన్స్‌కార్నర్, పుల్ అవుట్, టాల్ యూనిట్ ఇలా రకరకాల వాటిని మన అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తారు. ఒక్కో అర 50 కిలోల బరువును ఆపేలా ఉంటాయి. వేడి, నీటిని తట్టుకునేలా ఉంటాయి.