ఇన్ఫీకి చైర్మన్ కానీ.. వేతనం నిల్
సాక్షి, బెంగళూరు : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు తెలిసినవే. కార్పొరేట్ గవర్నెన్స్ లోపిస్తుందంటూ వ్యవస్థాపకుల మండిపాటు, వ్యవస్థాపకుల పోరు తట్టుకోలేమంటూ సీఈవో విశాల్ సిక్కా రాజీనామా ఇవన్నీ ఇన్ఫీలో హాట్‌టాపిక్‌గా మారాయి. సిక్కా రాజీనామాతో వ్యవస్థాకులకు, మేనేజ్‌మెంట్‌కు మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చెప్పడానికి నందన్ నిలేకని ఇన్ఫోసిస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు.
నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నందన్ నిలేకని ఇన్ఫీలో పదవి అలకరించారు. అయితే ఈ పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు గాను నందన్ నిలేకని ఎలాంటి వేతనం తీసుకోవడం లేదట. ఈ విషయాన్ని కంపెనీనే స్వయంగా చెప్పింది. నందన్ నిలేకని చివరి సారిగా 2010లో వేతనం తీసుకున్నారని కంపెనీ తన బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ సంస్థలో నందన్ నిలేకనికి 0.93 శాతం వాటా ఉంది. సీఈవోగా విశాల్ సిక్కా తప్పుకోవడంతో ఇన్ఫీ కొత్త చైర్మన్‌గా నందన్ నిలేకని ఆగస్టు 24న పదవీ బాధ్యతలు చేపట్టారు.
యూబీ ప్రవీణ్ రావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా తన స్థానంలో కొనసాగుతున్నారని, ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు గాను షేర్‌హోల్డర్స్ ఆమోదించిన మేరకు ఆయన వేతనం తీసుకుంటున్నారని ఇన్ఫోసిస్ స్పష్టంచేసింది. తాత్కాలికంగా చేపట్టిన సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి మాత్రం ఆయన ఎలాంటి అదనపు వేతనాన్ని తీసుకోవడం లేదని తెలిపింది. ఇన్ఫోసిస్‌కి కొత్త చైర్మన్‌గా వచ్చిన నిలేకని, తక్షణ కర్తవ్యంగా కంపెనీలో స్థిరత్వం సంపాదించడంతో పాటు, కొత్త సీఈవోను వెతికే పనిలో ఉన్నారు. కొత్త సీఈవో నియామకంలో సాయపడటానికి ఇగోన్ జెహెండర్ అనే ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ సంస్థను కూడా కంపెనీ నియమించుకుందని నిలేకని చెప్పారు.