Nandan Nilekani Salary
-
అత్యధిక వేతనం పొందే ఐటీ కంపెనీ సీఈవో ఎవరో తెలుసా?
సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ జీతం 88 శాతం పెరిగిందట. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఏడాదిలో పరేఖ్ వార్షిక వేతనం రూ. 79.75 కోట్లకు చేరింది. 2020-21లో రూ. 49.68 కోట్ల నుంచి వేతనం 88 శాతం పెరిగిందని ఎక్స్ఛేంజ్ఫైలింగ్లో కంపెనీ వెల్లడించింది. గురువారం విడుదల చేసిన కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, వాటాదారుల ఆమోదానికి లోబడి కొత్త ఉపాధి ఒప్పందం జూలై 2 నుండి అమలులోకి వస్తుంది. దీంతో భారతదేశంలో అత్యధిక వేతనం పొందే ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా నిలిచారు సలీల్ పరేఖ్. మరో దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ వార్షిక వేతనం రూ. 25.76 కోట్లు, విప్రో పారిస్ ఆధారిత సీఈవో వేతనం రూ. 64.34 కోట్లు. హెచ్‌సిఎల్ టెక్ సిఇఓ రూ.32.21 కోట్లు టెక్ మహీంద్రా సీఈవో రూ.22 కోట్ల వేతనం అందుకుంటున్నారు. అలాగే కంపెనీ సీఎండీగా సలీల్ పరేఖ్ పదవీకాలాన్ని మరో ఐదేళ్లు (మార్చి 2027 వరకు) పొడిగింపునకు ఇన్ఫోసిస్ బోర్డు నిర్ణయించింది. 2018 జనవరి నుంచి పరేఖ్ ఇన్ఫోసిస్ సీఎండీగా ఉన్నారు. ఇన్ఫోసిస్‌కు ముందు క్యాప్‌జెమినీలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్న పరేఖ్ 25 సంవత్సరాల పాటు అనేక నాయకత్వ పదవులను నిర్వహించారు. పరేఖ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇన్ఫోసిస్ స్టాక్ 183శాతం పెరిగింది. నీలేకని-పరేఖ్ కాంబోలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 19.7శాతం వృద్ధి రేటును సాధించింది. అలాగే ఆరుగురు కీలకమైన మేనేజ్మెంట్ సిబ్బందికి 104,000 షేర్లు,88 మంది ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు మరో 375,760 షేర్ల మంజూరుకు ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపింది. కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని ఎలాంటి పారితోషికం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫోసిస్‌లో అత్యధిక వేతనం పొందిన సీనియర్లుగా 37.25 కోట్లతో సీఓఓ యూబీ ప్రవీణ్ రావు, తరువాత 35.82 కోట్లతో ప్రెసిడెంట్ రవి కుమార్ ఉన్నారు. -
ఇన్ఫీకి చైర్మన్ కానీ.. వేతనం నిల్
సాక్షి, బెంగళూరు : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు తెలిసినవే. కార్పొరేట్ గవర్నెన్స్ లోపిస్తుందంటూ వ్యవస్థాపకుల మండిపాటు, వ్యవస్థాపకుల పోరు తట్టుకోలేమంటూ సీఈవో విశాల్ సిక్కా రాజీనామా ఇవన్నీ ఇన్ఫీలో హాట్‌టాపిక్‌గా మారాయి. సిక్కా రాజీనామాతో వ్యవస్థాకులకు, మేనేజ్మెంట్కు మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చెప్పడానికి నందన్ నిలేకని ఇన్ఫోసిస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నందన్ నిలేకని ఇన్ఫీలో పదవి అలకరించారు. అయితే ఈ పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు గాను నందన్ నిలేకని ఎలాంటి వేతనం తీసుకోవడం లేదట. ఈ విషయాన్ని కంపెనీనే స్వయంగా చెప్పింది. నందన్ నిలేకని చివరి సారిగా 2010లో వేతనం తీసుకున్నారని కంపెనీ తన బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ సంస్థలో నందన్ నిలేకనికి 0.93 శాతం వాటా ఉంది. సీఈవోగా విశాల్ సిక్కా తప్పుకోవడంతో ఇన్ఫీ కొత్త చైర్మన్‌గా నందన్ నిలేకని ఆగస్టు 24న పదవీ బాధ్యతలు చేపట్టారు. యూబీ ప్రవీణ్ రావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా తన స్థానంలో కొనసాగుతున్నారని, ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు గాను షేర్‌హోల్డర్స్ ఆమోదించిన మేరకు ఆయన వేతనం తీసుకుంటున్నారని ఇన్ఫోసిస్ స్పష్టంచేసింది. తాత్కాలికంగా చేపట్టిన సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి మాత్రం ఆయన ఎలాంటి అదనపు వేతనాన్ని తీసుకోవడం లేదని తెలిపింది. ఇన్ఫోసిస్‌కి కొత్త చైర్మన్‌గా వచ్చిన నిలేకని, తక్షణ కర్తవ్యంగా కంపెనీలో స్థిరత్వం సంపాదించడంతో పాటు, కొత్త సీఈవోను వెతికే పనిలో ఉన్నారు. కొత్త సీఈవో నియామకంలో సాయపడటానికి ఇగోన్ జెహెండర్ అనే ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ సంస్థను కూడా కంపెనీ నియమించుకుందని నిలేకని చెప్పారు.