Infosys Chairman Nandan Nilekani
-
దాతృత్వ హీరోల్లో నీలేకని, కామత్..
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, డీఎల్ఎఫ్ గౌరవ చైర్మన్ కేపీ సింగ్, జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వంటి దిగ్గజాలు సంపదను సమాజ శ్రేయస్సు కోసం కూడా గణనీయంగా ఉపయోగిస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 17వ ఆసియా దాతృత్వ హీరోల జాబితా (15 మంది)లో వారు చోటు దక్కించుకున్నారు. తాను విద్యాభ్యాసం చేసిన ఐఐటీ బాంబేకి 1999 నుంచి ఇప్పటివరకు నీలేకని రూ.400 కోట్లు విరాళంగా ఇచ్చారు. 2020లో డీఎల్ఎఫ్ చైర్మన్ హోదా నుంచి తప్పుకున్న సింగ్ (92 ఏళ్లు).. కంపెనీలో నేరుగా ఉన్న వాటాలను విక్రయించగా వచి్చన రూ.730 కోట్లను దాతృత్వ కార్యకలాపాలకు కేటాయించారు. జిరోధా కామత్ (37 ఏళ్లు) ‘డబ్ల్యూటీఎఫ్ ఈజ్’ పేరిట వ్యాపార దిగ్గజాలతో నిర్వహించే యూట్యూబ్ పాడ్‌కాస్ట్ సిరీస్ ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థలకు రూ. కోటి వరకు విరాళాలు అందచేస్తున్నారు. -
ఏఐ వ్యూహం భేషుగ్గా పని చేస్తోంది
న్యూఢిల్లీ: నైతికత, మేథోసంపత్తి హక్కులపరమైన వివాదాలు మొదలైనవి ఎలా ఉన్నప్పటికీ కృత్రిమ మేథ (ఏఐ)కి మరింత ప్రాధాన్యమివ్వాలన్న వ్యాపార వ్యూహం తమకు భేషుగ్గా పని చేస్తోందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని చెప్పారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ అంశాలు, డిమాండ్‌లో హెచ్చుతగ్గులు, సరఫరాపరమైన ఆటంకాలు మొదలైన సవాళ్లతో ఎప్పటికప్పుడు మారిపోతున్న పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవంతో కంపెనీ మరింత సమర్ధమంతంగా రాణించగలదని, వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇన్ఫోసిస్ 42వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా నీలేకని ఈ విషయాలు చెప్పారు. ‘ఏఐ విషయానికొస్తే అనేకానేక ఆచరణాత్మక, నైతిక, మేథోసంపత్తి హక్కులపరమైన అంశాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. కంపెనీలో అంతర్గతంగా ఏఐని మరింత విస్తృతం చేయడమనేది అనుకున్నంత సులువైన వ్యవహారమేమీ కాదని కూడా మనకు తెలుసు. అయినప్పటికీ, మనం పాటిస్తున్న ఏఐ–ఫస్ట్ వ్యూహం మనకు చక్కగా పని చేస్తోంది‘ అని పేర్కొన్నారు. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి గత నాలుగేళ్ల వ్యవధిలో కంపెనీ తన నగదు నిల్వల్లో 86 శాతం భాగాన్ని షేర్హోల్డర్లకు బదిలీ చేసిందని నీలేకని చెప్పారు. గతేడాది డివిడెండ్ల రూపంలో 1.7 బిలియన్ డాలర్లు, బైబ్యాక్ ద్వారా మరో 1.4 బిలియన్ డాలర్లు.. వెరసి 3.1 బిలియన్ డాలర్ల మొత్తాన్ని వాటాదారులకు బదలాయించామని పేర్కొన్నారు. -
దేవుడే చెప్పినా మా లెక్క తప్పదు!
న్యూఢిల్లీ: స్వయంగా దేవుడే వచ్చి చెప్పినా సరే తాము తప్పుడు లెక్కలు రాయబోమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని స్పష్టం చేశారు. టాప్ మేనేజ్మెంట్ అనైతిక విధానాలకు పాల్పడుతోందంటూ ప్రజావేగులు చేసిన ఆరోపణలు అవమానకరమైనవని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న విచారణపై తమ అభిప్రాయాలు రుద్దే ప్రసక్తి లేదని ఇన్వెస్టర్లతో సమావేశంలో నీలేకని చెప్పారు. మరోవైపు, ఫిర్యాదుల వెనుక సహ వ్యవస్థాపకులు, కొందరు మాజీ ఉద్యోగుల హస్తం ఉందంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. ఇవి హేయమైన ఆరోపణలని, వ్యవస్థాపకుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలని వ్యాఖ్యానించారు. భారీ ఆదాయాలు చూపేందుకు సీఈవో సలిల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో నీలేకని వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఈ వదంతులు హేయమైనవి. అంతా ఎంతగానో గౌరవించే వ్యక్తుల ప్రతిష్టను మసకబార్చే లక్ష్యంతో చేస్తున్నవి. సంస్థకు జీవితాంతం సేవలు అందించిన మా సహ–వ్యవస్థాపకులంటే నాకెంతో గౌరవం. వారు కంపెనీ వృద్ధి కోసం నిస్వార్థంగా కృషి చేశారు. భవిష్యత్‌లోనూ కంపెనీ శ్రేయస్సు కోసం పాటుపడేందుకు కట్టుబడి ఉన్నారు‘ అని ఆయన తెలిపారు. టాప్ మేనేజ్మెంట్పై వచ్చిన ఆరోపణల మీద ఇప్పటికే స్వతంత్ర న్యాయ సేవల సంస్థ విచారణ జరుపుతోందని, ఫలితాలు వచ్చాక అందరికీ తెలియజేస్తామని నీలేకని పేర్కొన్నారు. వివరాలు కోరిన ఎన్ఎఫ్ఆర్ఏ.. ప్రజావేగుల ఫిర్యాదులకు సంబంధించి నిర్దిష్ట వివరాలివ్వాలని నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ), కర్ణాటకలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కోరినట్లు ఇన్ఫీ తెలిపింది. ఎక్సే్ఛంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు కూడా మరింత సమాచారం అడిగినట్లు పేర్కొంది. అడిగిన వివరాలన్నింటిని సమర్పించనున్నట్లు ఇన్ఫీ వివరించింది. ప్రజావేగుల ఫిర్యాదులపై ఇన్ఫోసిస్ అంతర్గతంగా విచారణ జరుపుతోంది. అటు అమెరికన్ ఇన్వెస్టర్ల తరఫున అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా వేస్తామంటూ ఒక న్యాయ సేవల సంస్థ ప్రకటించింది. -
ఇన్ఫీకి చైర్మన్ కానీ.. వేతనం నిల్
సాక్షి, బెంగళూరు : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు తెలిసినవే. కార్పొరేట్ గవర్నెన్స్ లోపిస్తుందంటూ వ్యవస్థాపకుల మండిపాటు, వ్యవస్థాపకుల పోరు తట్టుకోలేమంటూ సీఈవో విశాల్ సిక్కా రాజీనామా ఇవన్నీ ఇన్ఫీలో హాట్‌టాపిక్‌గా మారాయి. సిక్కా రాజీనామాతో వ్యవస్థాకులకు, మేనేజ్మెంట్కు మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చెప్పడానికి నందన్ నిలేకని ఇన్ఫోసిస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నందన్ నిలేకని ఇన్ఫీలో పదవి అలకరించారు. అయితే ఈ పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు గాను నందన్ నిలేకని ఎలాంటి వేతనం తీసుకోవడం లేదట. ఈ విషయాన్ని కంపెనీనే స్వయంగా చెప్పింది. నందన్ నిలేకని చివరి సారిగా 2010లో వేతనం తీసుకున్నారని కంపెనీ తన బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ సంస్థలో నందన్ నిలేకనికి 0.93 శాతం వాటా ఉంది. సీఈవోగా విశాల్ సిక్కా తప్పుకోవడంతో ఇన్ఫీ కొత్త చైర్మన్‌గా నందన్ నిలేకని ఆగస్టు 24న పదవీ బాధ్యతలు చేపట్టారు. యూబీ ప్రవీణ్ రావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా తన స్థానంలో కొనసాగుతున్నారని, ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు గాను షేర్‌హోల్డర్స్ ఆమోదించిన మేరకు ఆయన వేతనం తీసుకుంటున్నారని ఇన్ఫోసిస్ స్పష్టంచేసింది. తాత్కాలికంగా చేపట్టిన సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి మాత్రం ఆయన ఎలాంటి అదనపు వేతనాన్ని తీసుకోవడం లేదని తెలిపింది. ఇన్ఫోసిస్‌కి కొత్త చైర్మన్‌గా వచ్చిన నిలేకని, తక్షణ కర్తవ్యంగా కంపెనీలో స్థిరత్వం సంపాదించడంతో పాటు, కొత్త సీఈవోను వెతికే పనిలో ఉన్నారు. కొత్త సీఈవో నియామకంలో సాయపడటానికి ఇగోన్ జెహెండర్ అనే ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ సంస్థను కూడా కంపెనీ నియమించుకుందని నిలేకని చెప్పారు.