
న్యూఢిల్లీ: నైతికత, మేథోసంపత్తి హక్కులపరమైన వివాదాలు మొదలైనవి ఎలా ఉన్నప్పటికీ కృత్రిమ మేథ (ఏఐ)కి మరింత ప్రాధాన్యమివ్వాలన్న వ్యాపార వ్యూహం తమకు భేషుగ్గా పని చేస్తోందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని చెప్పారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ అంశాలు, డిమాండ్‌లో హెచ్చుతగ్గులు, సరఫరాపరమైన ఆటంకాలు మొదలైన సవాళ్లతో ఎప్పటికప్పుడు మారిపోతున్న పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవంతో కంపెనీ మరింత సమర్ధమంతంగా రాణించగలదని, వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇన్ఫోసిస్ 42వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా నీలేకని ఈ విషయాలు చెప్పారు. ‘ఏఐ విషయానికొస్తే అనేకానేక ఆచరణాత్మక, నైతిక, మేథోసంపత్తి హక్కులపరమైన అంశాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. కంపెనీలో అంతర్గతంగా ఏఐని మరింత విస్తృతం చేయడమనేది అనుకున్నంత సులువైన వ్యవహారమేమీ కాదని కూడా మనకు తెలుసు. అయినప్పటికీ, మనం పాటిస్తున్న ఏఐ–ఫస్ట్ వ్యూహం మనకు చక్కగా పని చేస్తోంది‘ అని పేర్కొన్నారు. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి గత నాలుగేళ్ల వ్యవధిలో కంపెనీ తన నగదు నిల్వల్లో 86 శాతం భాగాన్ని షేర్‌హోల్డర్లకు బదిలీ చేసిందని నీలేకని చెప్పారు. గతేడాది డివిడెండ్‌ల రూపంలో 1.7 బిలియన్ డాలర్లు, బైబ్యాక్ ద్వారా మరో 1.4 బిలియన్ డాలర్లు.. వెరసి 3.1 బిలియన్ డాలర్ల మొత్తాన్ని వాటాదారులకు బదలాయించామని పేర్కొన్నారు.