2006 నుంచి ఆదాయపు పన్ను రిటర్నులను ఈ–ఫైలింగ్ ద్వారా చేయాలి. జనాలు అలవాటు పడ్డారు. అది సజావుగానే సాగుతోంది. 10 సంవత్సరాల తర్వాత అంటే 2016లో ఈ–అసెస్‌మెంట్లకు నాంది పలికారు. మామూలు అసెస్‌మెంట్‌లో అధికారులు నోటిసులిస్తారు. బదులుగా మనం అధికారులను కలిసి వారు అడిగిన అన్ని కాగితాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలి. అంతేకాక అకౌంట్స్ బుక్స్, పాస్‌బుక్‌లు, రుజువులు, ధ్రువీకరణ పత్రాలు, అగ్రిమెంట్లు ఇలా సవాలక్ష కాగితాలు అందివ్వాలి.
వారు రమ్మన్నప్పుడు వెళ్లాలి. చాలా సార్లు కలవాలి. వివరణలివ్వాలి. ఎంతో కాలం, ప్రయాస, వెళ్లి రావడానికి రవాణా ఖర్చులు, నిరీక్షణ, వాదోపవాదాలు, అధికారులు అదిరింపు, అసెసీ భయపడటం, ఒక్కొక్క కేసుకు సంబంధించి డిపార్ట్‌మెంట్‌లో ఉన్న కాగితాల కట్టల గుట్టలు.. ఇలా ఎన్నో. సవ్యంగా సాగితే సవరణ, వివరణ ఉంటాయి. లేదంటే రణమే. వీటన్నింటికీ మించి వ్యక్తిగత అభిప్రాయం, అభిమానం, అనుమానం ఎక్కువ పాత్ర పోషిస్తాయి.
వీటి ప్రభావం ఆదాయపు పన్ను భారంపై పడుతుంది. మంచి లేకపోలేదు. అధికారులు ఓపికగా ఉంటారు. ఇబ్బందులు వింటారు. సకాలంలో కాగితాలు ఇవ్వకపోతే తగిన కారణం ఉంటే సహకరిస్తారు. మానవతా దృక్పథం ఉంటుంది. అర్థం చేసుకుంటారు. సర్దుబాటు, దిద్దుబాటు, వెసులుబాటు ఉంటాయి. ఇలా గత 50 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియలో... ఈ–గవర్నెన్స్‌లో భాగంగా వస్తున్నాయి ఈ–అసెస్‌మెంట్లు. ఈ–ప్రోసీడింగ్స్‌లో నోటీసులు, ప్రశ్నలు ఉంటాయి.
మొబైల్ ఫోన్‌కి సంక్షిప్త సమాచారం ఇస్తారు. స్క్రూటినీ పాక్షికమా, సమగ్రమా తెలియజేస్తారు. అయితే అసెసీకి ఒక అవకాశమిస్తారు. ఇక్కడ మాన్యువల్ లేదా ఈ–అసెస్‌మెంట్ అనేది మన ఇష్టం. మీరు ఇవ్వాల్సిన సమాచారం ఈ–మెయిల్ ద్వారా ఇవ్వాలి. అది 10 మెగాబైట్స్ దాటకూడదు. ఎప్పటికప్పుడు మై అకౌంట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవాలి. మెయిల్స్ ఓపెన్ చేసి సమాధానమివ్వాలి. అధికారులకు తగిన సమాచారం లభించిన తర్వాత క్లోజ్ చేస్తారు.
తర్వాత ఆర్డర్లు ఈ–మెయిల్ ద్వారా వస్తాయి. ఇది పూర్తిగా టెక్నాలజీ మీద ఆధారపడి జరిగే ప్రక్రియ. మీ కాగితాల్లో ఉన్న దాని ప్రకారం జరుగుతుంది. మీ కాగితాలే మాట్లాడతాయి. మీ మాట ఎవ్వరూ విన్నరు. మిమల్ని ఎవ్వరూ చూడరు. వయోవృద్ధులకు ఇది శరఘాతం. కాగితాల్లో తప్పు చోటుచేసుకుంటే అసెస్‌మెంట్ తప్పవుతుంది. సర్దుబాటుకు అవకాశం లేదు. వ్యక్తిగత విచారణ ఉండదు.
డిజిటలైజేషన్ జిందాబాద్
అక్షరాస్యతలో వెనకున్నాం. ఈ టెక్నాలజీతో పరిగెత్తగలమా? అధికారులకిది కొత్తే. అసెసీలకు వింత. కొత్తపొంతలు తొక్కేటప్పుడు వెసులుబాటు, సర్దుబాటు ఉండాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ అసెస్‌మెంట్ కేవలం రికార్డుల ప్రకారం జరిగే ప్రక్రియ కాదు. ప్రతి దాన్నీ కాగితాలతో, రుజువులతో బేరీజు వేయకూడదు. కాగితం అంటే చట్టం. కానీ న్యాయం, ఔచిత్యం చూడాలి. ఎందుకంటే కాగితాలకందని ఎన్నో విషయాలుంటాయి.
ఖర్చు స్వభావం, ప్రయోజనం, వాస్తవికత, నిజాయితీ, వర్తింపు, న్యాయం, విశ్వసనీయత, ఉద్దేశం వీటన్నింటిలో అధికారులు సంతృప్తి చెందాలి. విటన్నింటికీ మానవ దృక్పథం వెన్నెముకలాగా ఉంటుంది. మొదట్లో ఇబ్బందులు ఉన్నా ఇరువురి సహకారంతో ముందుకు వెళ్లొచ్చు. విద్యతో నిమిత్తం లేకుండా కొన్ని కోట్ల మంది మొబైల్స్ వాడుతున్నారు. ఈ పేమెంట్లు చేస్తున్నారు. మార్పుకి ఓటేస్తున్నారు. మంచి ఫలితానిచ్చే ఏ మార్పునైనా ప్రజలు మన్నించక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment