
కార్పొరేట్ ప్రతిష్టకు ‘టాటా’!!
2016 రివైండ్
దేశంలో పెద్దది, అత్యంత విశ్వసనీయమైనది అనుకునే బ్రాండ్ ఏదైనా ఉంటే అది టాటానే. పచారీ సరుకుల నుంచి ఆభరణాల దాకా దాదాపు ప్రతి రంగంలోనూ ఉండటం... అన్నిట్లోనూ కోట్ల మంది వినియోగదారులుండటం దీనికి కారణంగా భావించొచ్చు. కాకపోతే ఇంతటి గ్రూప్ పరువు ఈ అక్టోబర్ 24న వీధిలోకొచ్చింది. గ్రూపు చైర్మన్ గా ఉన్న సైరస్ పల్లోంజీ మిస్త్రీని టాటా బోర్డు అనూహ్యంగా తొలగించింది. అప్పట్లో కారణాలు తెలియరాకున్నా... రానురాను జరిగిన ఘటనలు చూస్తే ఇది కేవలం ‘రతన్ టాటా– సైరస్ మిస్త్రీ’ మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలకటానికేనని తేలిపోయింది. నిజానికి 2012 డిసెంబర్ 28న మిస్రీ్తని ఈ పదవిలో కూర్చోబెట్టింది కూడా రతన్ టాటానే. మిస్త్రీ కుటుంబానికి టాటా సన్స్ లో 18 శాతం వాటా కూడా ఉంది. కానీ నాలుగేళ్లు తిరిగేసరికి... మిస్రీ్తని గెంటేసి రతన్ టాటా తిరిగి తాత్కాలిక చైర్మన్ బాధ్యతల్లోకి వచ్చేశారు. తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు... బోర్డ్ రూమ్ సమావేశాలు, ఎత్తులు పైఎత్తుల పర్వం తర్వాత ఈ వివాదం చివరికి కంపెనీ లాబోర్డును చేరింది.
మిస్త్రీని తొలగించటానికి కారణాలు చెబుతూ... టాటా గ్రూపు పలు ఆరోపణలు చేసింది. ఆయన గ్రూపు రుణభారాన్ని పెంచేశారని, సమస్యలున్నాయంటూ పలు కంపెనీలను వదిలించుకోవటానికి ప్రయత్నించారని, టాటాల విలువల్ని ఏమాత్రం పట్టించుకోలేదని, అధికార రహస్యాలను కూడా బయటపెట్టారని ఆరోపించింది. మిస్త్రీ తక్కువేమీ తినలేదు. రతన్ టాటా తనకు చైర్మన్ బాధ్యతలు అప్పగించినా, స్వతంత్రంగా పనిచేసుకోనివ్వకుండా, మరో అధికార కేంద్రాన్ని నడిపించారని... కార్పొరేట్ గవర్నెన్స్ ను మంటగలిపారని, నష్టాలొస్తున్నా పట్టించుకోకుండా తన అహం కోసం నానో వంటి బ్రాండ్లను నడిపిస్తున్నారని, చాలా కొనుగోళ్లకు ఎక్కువ మొత్తం పెట్టారని... రకరకాల ఆరోపణలు చేశారు. కానీ టాటా బోర్డు రతన్ టాటా వైపే ఉండటంతో మిస్రీ్తని దాదాపు అన్ని టాటా కంపెనీల నుంచీ తొలగించారు. ఆయనకు మద్దతు పలికిన స్వతంత్ర డైరెక్టరు నుస్లీ వాడియానూ అదే చేశారు. నిజానికి ఈ వివాదం ఈ ఏడాదితో ముగిసిపోలేదు. 2017లో కంపెనీ లాబోర్డు ముందు కొత్త మలుపు తీసుకోవచ్చు కూడా.
పెద్ద నోట్ల రద్దు... దేనికంట?
ఈ ఏడాది నవంబర్ 8న రాత్రి 8 గంటల సమయంలో ప్రధాని నరేంద్రమోదీ ఓ బాంబు పేల్చారు. ఆ రోజు అర్ధరాత్రి నుంచీ రూ.500, రూ.1000 నోట్లు చెల్లవని ప్రకటించారు. వాటిని డిసెంబర్ 30 వరకూ బ్యాంకుల్లో మాత్రం డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పారు. దీనికి ఆయన చెప్పిన కారణాలు రెండు!! 1) నకిలీ నోట్లు భారీగా చలామణిలోకి వచ్చి, వాటి సాయంతో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని. 2) చాలామంది దగ్గర ఈ పెద్ద నోట్ల రూపంలో నల్లధనం పోగుపడిపోయి ఉందని, ఈ దెబ్బతో వారు దాన్ని డిపాజిట్ చేయలేక గంగానదిలో విసిరేయటమో, తగలబెట్టడమో చేస్తారని. అది విన్న జనం... నల్ల కుబేరుల్ని మోదీ భలే దెబ్బతీశారని సంతోషించారు. కాకపోతే రోజులు గడుస్తున్నకొద్దీ పాతనోట్లు చెల్లక, కొత్త నోట్లు అందుబాటులో లేక, వ్యాపారాలేవీ సాగకపోయేసరికి మోదీ ఎవరిని దెబ్బతీశారనేది అర్థంకాలేదు.
కనీసం తిండికి కూడా కరువయ్యే పరిస్థితులొచ్చేసరికి దెబ్బతిన్నది తామేనని తెలిసిపోయింది. చలామణిలో ఉన్న నోట్లకన్నా ఎక్కువ నగదు బ్యాంకుల దగ్గర డిపాజిట్ అయినట్లు వార్తలు వెలువడటంతో... కొన్ని దొంగనోట్లూ బ్యాంకుల్లోకి చేరాయని... అక్రమార్కులు తెలివిగా బ్లాక్ మనీ మొత్తాన్ని మార్చేసుకున్నారని అర్థమైంది. అయితే ప్రభుత్వం డిజిటల్ లావాదేవీల్ని పెంచటానికే పెద్ద నోట్లు రద్దు చేశామంటూ కొత్త పల్లవి అందుకుంది. మరి దీని ప్రభావమేంటి? వృద్ధి రేటు అంచనాలు బాగా తగ్గాయి. చివరి త్రైమాసికంలో వృద్ధిరేటు దారుణంగా తగ్గొచ్చనే అంచనాలు వెలువడ్డాయి. కాకపోతే ఇబ్బందులు తాత్కాలికమేనంటూ అందరూ తమను తాము సమాధానపరచుకుంటున్నారు. అదే ఈ ఏడాదికి ఊరట!!.
ఈక్విటీ, డెట్ .. ప్చ్!
ఈ ఏడాది స్టాక్, రుణ మార్కెట్లు రెండూ ఇన్వెస్టర్లకు సరైన లాభాలు ఇవ్వలేకపోయాయి. ఈ ఏడాది బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లలో మొదలైన ర్యాలీ... అనేక ఆటుపోట్ల తరవాత ప్రస్తుతం మళ్లీ మొదటికొచ్చింది. ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ మార్పు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా డొనాల్డ్ ట్రంప్ విజయం, పెద్ద నోట్ల రద్దు... ఇవన్నీ అనిశ్చితికి దారితీశాయి. గతేడాది ముగింపు 26,117.54 పాయింట్లతో పోలిస్తే ఈ ఏడాది చివరికి సెన్సెక్స్ 508 పాయింట్లు మాత్రమే లాభపడింది. ఇక విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది తొలి 9 నెలల్లో రూ.51,293 కోట్లు ఇన్వెస్ట్ చేసి... అక్టోబర్ నుంచి అమ్మకాలకు దిగారు. దీంతో డిసెంబర్ 27 నాటికి నికర పెట్టుబడులు రూ.26,213 కోట్లకు పరిమితం అయ్యాయి.
టెలికం బరిలో జియో ఫ్రీ ఎంట్రీ!
రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులతో రిలయన్స్ జియో సెప్టెంబర్ 3న మెగా ఎంట్రీ ఇచ్చింది. జీవిత కాలం ఉచిత కాల్స్, మూడునెలల పాటు 4జీ డేటా ఉచితం అంటూ వల విసిరింది. 83 రోజుల్లో 5 కోట్ల మంది కస్టమర్లను సంపాదించింది. దీంతో ప్రత్యర్థులు ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ కూడా దిగొచ్చాయి. అపరిమిత కాల్స్, పరిమిత డేటా పథకాలు ప్రకటించాయి. కానీ కాల్స్ కనెక్ట్ కాక, ఉచిత డేటాలో వేగం లేక జియో కస్టమర్లు అసంతృప్తితోనే ఉన్నారు. జియో పోటీని తట్టుకోవటానికి వీడియోకాన్ నుంచి ఎయిర్‌టెల్ రూ.4,428 కోట్లకు స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. ఎయిర్‌సెల్‌కు చెందిన 4జీ ఎయిర్‌వేస్‌ను కూడా రూ.3,500 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక సెప్టెంబర్‌లో వొడాఫోన్ గ్రూపు ఇండియా కార్యకలాపాల కోసం రూ.47,000 కోట్ల నిధుల్ని కేటాయించింది.
తనిఖీలతో ఫార్మా కుదేలు...
పలు ఫార్మా కంపెనీలు ఈ ఏడాది యూఎస్ ఎఫ్‌డీఏ తనిఖీల్ని ఎదుర్కొన్నాయి. వోకార్డ్, దివీస్ ల్యాబ్స్ ప్లాంట్లలో తగిన ప్రమాణాలు లేవని ఎఫ్‌డీఏ అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఆయా షేర్లను పడగొట్టింది. అరబిందో ఫార్మా, సన్ ఫార్మా తదితర కంపెనీలు ధరల విషయంలో కుమ్మక్కయ్యాయంటూ అమెరికా చర్యలు చేపట్టడం వీటి షేర్లపై ప్రభావాన్ని చూపించింది. మరోవంక బ్రెగ్జిట్ కూడా ఫార్మా కంపెనీల ఆదాయాలపై ప్రభావం చూపుతుందనే విశ్లేషణలు వెలువడ్డాయి.
2018లోనే జీఎస్‌టీ అమలు!!
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వస్తు సేవల పన్నుకు (జీఎస్‌టీ) ఆగస్ట్ 8న మోక్షం లభించింది. వివిధ రకాల రాష్ట్రాల పన్నులు, కేంద్రం పన్నుల స్థానంలో జీఎస్టీ అమల్లోకి రావడం ద్వారా యావత్‌దేశం ఒకే మార్కెట్‌గా అవతరించనుంది. 2017లో ఇది అమల్లోకి రావచ్చని భావిస్తున్నా... నోట్ల రద్దు నేపథ్యంలో 2018లోనే అమల్లోకి వస్తుందనేది తాజా అంచనా.
ఎగుడు దిగుళ్ల రియల్టీ!!
కొన్నేళ్లుగా డౌన్ లో ఉన్న మార్కెట్ ఈ ఏడాది కాస్త మెరుగుపడింది. తొలి 10 నెలల్లో ఇళ్ల విక్రయాలు పర్వాలేదనిపించాయి. తొలిసారి గృహరుణం తీసుకున్న వారికి అదనంగా రూ.50వేల వడ్డీ మినహాయింపు ప్రయోజనాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించడం ఈ రంగానికి జోష్ నిచ్చింది. రియల్ ఎస్టేట్ నియంత్రణ, అభివృద్ధి బిల్లును ఈ ఏడాదే పార్లమెంటు ఆమోదించింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌ల లిస్టింగ్‌కూ అడ్డంకులు తొలగిపోయాయి. నవంబర్లో నోట్ల రద్దు నిర్ణయం వెలువడ్డాక మాత్రం మార్కెట్ మళ్లీ డౌనయింది. డెవలపర్లు తమ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఈ ఏడాది ప్రయివేటు ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి రూ.48,300 కోట్లు సమీకరించారు. ఇది గతేడాది కంటే 53 శాతం అధికం. 2017 రియల్టీకి గోల్డెన్ ఇయర్ అవుతుందనేది ఆ వర్గం నమ్మకం.
రూపాయి... బాగా పడింది
2016లో రూపాయి మారకపు విలువ డాలర్‌తో పోలిస్తే 2.5 శాతం క్షీణించింది. గతేడాది చివర్న 66.15 స్థాయి వద్ద ఉన్న రూపాయి అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచాక 68.90 రికార్డు స్థాయికి పడింది. తర్వాత స్వల్పంగా కోలుకుని డిసెంబర్ 30న 67.90 వద్ద ముగిసింది. భారత్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధుల్ని వెనక్కు తీసుకోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణం. 2013లో సమీకరించిన విదేశీ కరెన్సీ డిపాజిట్లను భారత్ ఈ నవంబర్‌లో చెల్లించాల్సి రావటం కూడా రూపాయిని పడేసింది. గల్ప్ దేశాల నుంచి రెమిటెన్సులు తగ్గడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం వంటివి ఈ పతనానికి ఆజ్యం పోశాయి.
ట్రంప్... భారత ఐటీకి చిక్కేనా?
2016లో అంతర్జాతీయంగా ఐటీపై ఖర్చులు 0.3 శాతం తగ్గాయి. మాంద్యం పరిస్థితులతో దేశీ ఐటీ దిగ్గజాలు మెరుగైన ఫలితాలను సాధించలేకపోయాయి. పులిమీద పుట్రలా తాత్కాలిక వర్కింగ్ వీసా ఫీజుల్ని అమెరికా భారీగా పెంచింది. విప్రో 50 కోట్ల డాలర్లతో అప్పీరియోను... హెసీఎల్ టెక్నాలజీస్ 20 కోట్ల డాలర్లతో జియోమెట్రిక్‌ను కొనుగోలు చేశాయి. ఇన్ఫోసిస్ పలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టింది. 150 బిలియన్ డాలర్ల దేశీ ఐటీ విపణిలో 60% ఎగుమతుల ద్వారా వస్తున్నదే. కానీ, అమెరికా అధ్యక్ష ఎన్నికలో ట్రంప్ గెలవటం ఐటీ అనిశ్చితికి దారితీసింది. ఇమిగ్రేషన్ వీసా నిబంధనలను కఠినం చేయవచ్చని, వ్యయాలు పెరిగిపోతాయని అంచనాలున్నాయి. బ్రెగ్జిట్ ప్రభావం కూడా ఐటీ ఎగుమతులపై పడొచ్చనే ఆందోళనలున్నాయి.
ఫెడ్ రేట్ల... భయం భయం!
అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్... డిసెంబర్లో ఫండ్ రేటును పావు శాతం పెంచింది. అమెరికా ఆర్థిక రంగం కోలుకుంటున్నందున వచ్చే ఏడాది నుంచి మూడేళ్ల పాటు... ఏటా మూడు సార్లు రేట్లను పెంచుతామనే సంకేతాలూ ఇచ్చింది. దీంతో డాలర్ బలపడింది. మన రూపాయి రూ.68కి క్షీణించింది. ఎఫ్‌ఐఐల నిధుల ఉపసంహరణ కూడా మొదలైంది. అదే వచ్చే ఏడాది మార్కెట్లపై ఒక అంచనాకు రాలేకుండా చేస్తోంది.
మూడేళ్ల తర్వాత లాభాల్లో∙పుత్తడి
వరుసగా మూడేళ్లు నష్టాల్ని మూటగట్టుకున్న పుత్తడి 2016లో స్వల్ప లాభాలందించింది. ఈ ఏడాది ఒక దశలో 29 శాతం పెరిగిన బంగారం ధర... సంవత్సరాంతానికి చాలా కోల్పోయింది. బులియన్ విశ్లేషకుల వేసిన అంచనాలకు పూర్తి భిన్నంగా బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవటం విశేషం. 2015 డిసెంబర్లో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచాక పుత్తడి ధర పతనమవుతుందని, ట్రంప్ గెలవటంతో ఈ ధర పెరుగుతుందని విశ్లేషకులు అంచనావేయగా, అందుకు భిన్నమైన రీతిలో జరిగింది. ఈ డిసెంబర్ 14న ఫెడ్ తిరిగి రేట్లను పెంచాక పుత్తడి క్షీణిస్తూ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఏడాది ప్రారంభంలో 1060 డాలర్ల వద్దనున్న ఔన్సు బంగారం ధర ఆగస్టుకల్లా 29 శాతం ఎగబాకి 1,372 డాలర్ల గరిష్టస్థాయికి చేరింది. తర్వాత 1,158 డాలర్లకు దిగింది.
దీంతో ఏడాది మొత్తంమీద 9 శాతం పెరిగినట్లయింది. దేశీయంగా ముంబై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర ర్యాలీ రూ.25,150 నుంచి మొదలై ఆగస్టులో నాలుగేళ్ల గరిష్టస్థాయి రూ.31,720 వద్దకు చేరింది. సంవత్సరంలో చివరి ట్రేడింగ్ రోజున రూ.28,050 వద్ద ముగిసింది. దీంతో ఏడాది మొత్తంమీద రూ. 2,900 మేర (11.3 శాతం) పెరిగినట్లయింది. ప్రపంచ మార్కెట్‌తో పోలిస్తే దేశీయంగా ఎక్కువ పెరగడానికి కారణం రూపాయి మారకపు విలువ క్షీణించటమే.
కొనుగోళ్లు, విలీనాల రిటైల్
ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సవాళ్లను తట్టుకుంటూ రిలయన్స్ రిటైల్, మహీంద్రా, ఫ్యూచర్ రిటైల్, మోర్ సంస్థలు బాగా విస్తరించాయి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్... ‘ఫరెవర్21’ను సొంతం చేసుకుంది. ఫ్యూచర్ రిటైల్ సంస్థ ఫ్యాబ్ ఫర్నిష్.కామ్‌ను, హెరిటేజ్ ఫ్రెష్ దుకాణాలను సొంతం చేసుకుంది. మహీంద్రా రిటైల్ సంస్థ బేబీఓయే కార్యకలాపాలను విలీనం చేసుకుంది. కాకపోతే పెద్ద నోట్ల రద్దుతో ఏడాది చివర్లో విక్రయాలు మందగించాయి. స్వీడన్ కు చెందిన రిటైల్ ఫర్నిచర్ దిగ్గజం ఐకియా భారత్‌లోకి అడుగుపెట్టింది. వచ్చే కొన్నేళ్లలో రూ.10వేల కోట్ల పెట్టుబడికి ప్రణాళికలు వేసుకుంది. ప్రభుత్వం 100 శాతం సింగిల్ బ్రాండ్ రిటైల్‌కు అనుమతించడంతో పుమా, అడిడాస్ సొంత స్టోర్లను తెరిచాయి.
పడిలేచిన ముడిచమురు!
2016లో ముడి చమురు భారీ రాబడుల్ని అందించింది. ఇది కూడా పుత్తడిలానే మూడేళ్లపాటు క్షీణిస్తూ వచ్చింది. 2016 జనవరిలో 14 ఏళ్ల కనిషా్ఠనికి పడిపోయింది. చమురు ఎగుమతి దేశాల నుంచి సరఫరాలు పెరగడం, అమెరికాలో షేల్ గ్యాస్ దిగుబడులు పెరగడంతో క్రూడ్ క్షీణిస్తూ వచ్చింది. అధికంగా క్రూడ్ దిగుమతి చేసుకునే అమెరికా స్వదేశంలోనే షేల్ గ్యాస్ ద్వారా ఉత్పత్తిని పెంచుకోవడం క్రూడ్ పతనానికి ముఖ్య కారణం. 2016 జనవరిలో 37.22 డాలర్ల వద్దనున్న బ్యారల్ బ్రెంట్ క్రూడ్ అదే నెల మధ్యలో 27.88 డాలర్ల వద్దకు పతనమయింది. అప్పట్నుంచి వేగంగా పెరిగిన క్రూడ్ దాదాపు రెట్టింపై 57 డాలర్ల స్థాయిని దాటింది. డిసెంబర్ 30న 56.68 డాలర్లకు చేరింది. దీంతో ఏడాది మొత్తం మీద క్రూడ్ 52%పైగా రాబడినిచ్చినట్లయ్యింది.