నిఫ్టీ.. న్యూ హై
10,153 పాయింట్ల వద్ద నిఫ్టీ ముగింపు
► సెన్సెక్స్ 151 పాయింట్లు అప్
► అంతర్జాతీయ సానుకూల ట్రెండ్ ప్రభావం
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ట్రెండ్ ప్రభావంతో సోమవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సరికొత్త రికార్డుస్థాయికి చేరింది. ఆగస్టు 2నాటి రికార్డుస్థాయి అయిన 10,138 పాయింట్లస్థాయిని దాటిన నిఫ్టీ ఇంట్రాడేలో 10,172 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 68 పాయింట్ల లాభంతో 10,153 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే బీఎస్‌ఈ సెన్సెక్స్ మాత్రం ఆగస్టు 2నాటి 32,686 పాయింట్ల రికార్డుస్థాయిని ఇంకా అందుకోవాల్సివుంది. ఈ సూచీ 32,502 పాయింట్ల వరకూ పెరిగిన తర్వాత..చివరకు 151 పాయింట్ల లాభంతో 32,424 పాయింట్ల వద్ద ముగిసింది.
గత శుక్రవారం అమెరికా మార్కెట్ కొత్త గరిష్టస్థాయిని చేరిన ప్రభావంతో ఆసియా సూచీలు సోమవారం జోరుగా ర్యాలీ జరిపాయి. హాంకాంగ్, కొరియా, సింగపూర్, తైవాన్ తైపీ సూచీలు 0.5–1.5 శాతం మధ్య పెరిగాయి. యూరప్ సూచీలు స్వల్పలాభాలతో ముగియగా, అమెరికా ఎస్‌అండ్‌పీ–500 సూచీ 2,500 పాయింట్ల స్థాయిని అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పింది. తాజా పెరుగుదలతో బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 136.76 లక్షల కోట్లకు చేరింది.
ఫెడ్‌పై కన్ను..: ఉత్తర కొరియా ఉద్రిక్తతలు చల్లారడం, బుధవారంనాటి ఫెడరల్ రిజర్వ్ సమీక్షలో వడ్డీ రేట్లు పెరగకపోవొచ్చన్న అంచనాలు ర్యాలీకి కారణమని విశ్లేషకులు చెప్పారు. అంతర్జాతీయ సంకేతాల పటిష్టత కారణంగా నిఫ్టీ కొత్త హైకి చేరిందని, క్రమేపీ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తగ్గడం, స్వల్పంగా కొనుగోళ్లకు శ్రీకారం చుట్టడం కూడా సెంటిమెంట్‌ను బలపర్చిందని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. మరోవైపు మంగళ, బుధవారాల్లో జరగనున్న ఫెడ్ సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టి నిలిపారని, వడ్డీ రేట్లను య«థాతథంగా అట్టిపెడతారన్న అంచనావేస్తున్నట్లు ఆయన వివరించారు.
బ్యాంక్ నిఫ్టీ స్పీడు...
కొన్ని హెవీవెయిట్ బ్యాంకింగ్ షేర్లు ర్యాలీ జరపడంతో ఎన్‌ఎస్‌ఈ బ్యాంక్ నిఫ్టీ 0.8 శాతంపైగా ర్యాలీ జరిపి 25,000 పాయింట్ల స్థాయిని అధిగమించి.. 25,046 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ గత నెలలో 25,198 పాయింట్ల వద్ద నెలకొల్పిన కొత్త రికార్డును అందుకోవాల్సివుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు 1% పెరిగి చరిత్రాత్మక గరిష్టస్థాయి రూ.1,861 వద్ద క్లోజయ్యింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 3%, కొటక్ బ్యాంక్ 1.5% చొప్పున ఎగిసాయి. క్యాపిటల్ గూడ్స్, ఆటో, టెక్నాలజీ, విద్యుత్ షేర్లు ర్యాలీలో పాలుపంచుకున్నాయి. సెన్సెక్స్–30 షేర్లలో అన్నింటికంటే అధికంగా బజాజ్ ఆటో 3.57 శాతం పెరిగి కొత్త రికార్డుస్థాయి రూ. 3,129 వద్ద ముగిసింది.