ముంబై : అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచుతాదనే సంకేతాలు ఊపందుకోవడంతో గురువారం ట్రేడింగ్ లో నష్టాలు పాలైన దేశీయ సూచీలు, శుక్రవారం ట్రేడింగ్ లో కొంతమేర కోలుకుని స్వల్పలాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 28.20 పాయింట్ల లాభంతో 25,427.92 వద్ద, నిఫ్టీ 3.35 పాయింట్ల లాభంతో 7786.65గా కొనసాగుతున్నాయి. సన్ ఫార్మా, ఓఎన్జీసీ, ఐటీసీ, బీహెచ్ఈఎల్, యాక్సిస్ బ్యాంకు లాభాల్లో నడుస్తుండగా.. లుపిన్, మారుతీ, ఇన్ఫోసిస్, హీరో మోటార్ కార్పొరేషన్లు నష్టాలు పాలవుతున్నాయి. రియాల్టీ, ఆయిల్, గ్యాస్, మూలధన ఉత్పత్తులు, బ్యాంకింగ్ స్టాక్స్ నిఫ్టీని నష్టాల బాట నుంచి లాభాల్లో నడిపిస్తున్నాయి.
సింగపూర్ స్టాక్ ఎక్సేంజ్ కూడా 20.50 పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతుండటంతో, దేశీయ సూచీలు పాజిటివ్ గానే ప్రారంభమయ్యాయి. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినా అవి ఈక్విటీ మార్కెట్లోకి ప్రవేశించే ఎఫ్ఐఐలపై కొంత మాత్రమే ప్రభావం చూపుతాయని, డాలర్ బలపడినా మరీ అంత నెగిటివ్ ట్రేడ్ ఉండదని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మార్కెట్లు కొంత మెరుగుపడ్డాయి. మరోవైపు బంగారం, వెండి ధరలు నష్టాలు పాలవుతున్నాయి. పసిడి రూ.65 నష్టంతో రూ.29,732గా.. వెండి రూ.18 నష్టంతో రూ.39,806గా ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 67.34గా ఉంది.