మార్కెట్ పంచాంగం
రిజర్వుబ్యాంకు తాజా పరపతి సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించలేదన్న నిరుత్సాహంతో పాటు పలు బ్యాంకుల ఎన్‌పీఏలు పెరగడంతో గతవారం బ్యాంకింగ్ ఇండెక్స్ 5 శాతంపైగా క్షీణించింది. ఇప్పటికే బ్యాంకింగ్ ఇండెక్స్ ఇటీవలి రికార్డు గరిష్టస్థాయి నుంచి 10 శాతంపైగా పతనమయ్యింది. కానీ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు మాత్రం వాటి ఆల్‌టైమ్ గరిష్టస్థాయి నుంచి 3.5 శాతమే తగ్గాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు పటిష్టంగా ట్రేడవుతున్నందున, ప్రధాన సూచీల్లో క్షీణత అల్పంగా వుంది. ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే పలు వార్తలు వెలువడే సమయంలో కూడా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు బలంగా నిలిస్తే, కొద్దిరోజుల కరెక్షన్ తర్వాత ప్రధాన సూచీల్లో బడ్జెట్ ర్యాలీ మొదలయ్యే ఛాన్స్ వుంటుంది. ఇక సాంకేతికాంశాలకొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
ఫిబ్రవరి 6తో ముగిసిన వారంలో వరుసగా ఐదు రోజులూ క్షీణించిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 465 పాయింట్ల నష్టంతో 28,718 పాయింట్ల వద్ద ముగిసింది. గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 28,790 పాయింట్ల దిగువన సెన్సెక్స్ ముగిసినందున, ఈ వారం మరింత క్షీణత కొనసాగే అవకాశం వుంది. సెన్సెక్స్ తిరిగి అప్‌ట్రెండ్‌లోకి ప్రవేశించాలంటే 29,270 పాయింట్ల నిరోధస్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో దాటాల్సివుంటుంది. లేదా వచ్చే కొద్దిరోజుల్లో 28,200 స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే ప్రస్తుత అప్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడుతుందని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి. ఈ సోమవారం ఢిల్లీ ఎగ్జిట్‌పోల్స్‌కు ప్రతికూలంగా మార్కెట్ స్పందిస్తే 28,325 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన 28,200 స్థాయికి తగ్గవచ్చు. ఈ రెండో స్థాయి వద్ద ఈ వారం మార్కెట్ మద్దతు పొందగలిగితే వచ్చే బడ్జెట్ సమయానికల్లా 30,000 శిఖరాన్ని అందుకునే వీలుంటుంది. ఈ వారం మార్కెట్ పెరిగితే తొలి అవరోధం 29,070 సమీపంలో ఎదురవుతున్నది. ఆపైన 29,270 స్థాయివరకూ పెరగవచ్చు. ఈ స్థాయిని బలంగా బ్రేక్‌చేస్తే 29,800 స్థాయికి ర్యాలీ జరపవచ్చు. 28,200 దిగువన మద్దతులు 27,900, 27,650 పాయింట్లు.
నిఫ్టీ ముఖ్య మద్దతు 8,530
బ్యాంక్ నిఫ్టీ భారీ పతనం కారణంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గతవారం 148 పాయింట్లు నష్టంతో 8,661 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం నిఫ్టీ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 8,575 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 8,530 పాయింట్ల మద్దతు స్థాయి నిఫ్టీకి ప్రధానమైనది. మార్కెట్‌ను ప్రభావితం చేసే పలు వార్తలు ఈ వారం వెలువడనున్నాయి. ఈ సందర్భంగా నిఫ్టీ ఈ స్థాయిని గనుక పరిరక్షించుకోగలిగితే, కొద్దివారాల్లో మళ్లీ 9,000 పాయింట్ల స్థాయికి పెరిగే చాన్స్ ఉంటుంది. ఈ వారం నిఫ్టీ పెరిగితే తొలుత 8,775 పాయింట్ల అవరోధ స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన 8,840 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే 8,966 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చు. కీలకమైన 8,530 పాయింట్ల మద్దతుస్థాయిని నిఫ్టీ కోల్పోతే.. ఆ దిగువన మద్దతు స్థాయిలు 8,420, 8,350 పాయింట్లు.
కీలక మద్దతు 28,200
Published Mon, Feb 9 2015 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM
Advertisement
Advertisement