
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం భారీ లాభంతో మొదలైంది. నిప్టీ 10వేల పైన 211 పాయింట్ల లాభంతో 10025.50 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 717 పాయింట్లు పెరిగి 33946 వద్ద మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్ల లాభాల ట్రేడింగ్ మన స్టాక్ మార్కెట్ భారీ గ్యాప్ అప్ ప్రారంభానికి కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం కూడా మన మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 20వేలపైన 20,553.00 వద్ద ట్రేడ్ అవుతోంది. హెచ్‌పీఎల్, ఎన్‌ఎండీసీ, ఇప్కా లాబ్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో పాటు సుమారు 25 కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు 4త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి.
ప్రపంచ ఈక్విటీలకు ఫెడ్ బూస్టింగ్:
ఆర్థిక వ్యవస్థకు అండగా అమలు చేస్తున్న భారీ సహాయక ప్యాకేజీలో భాగంగా అమెరికాలో అర్హతగల అన్ని కార్పొరేట్ బాండ్లను నేటి నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. దీంతో లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కంపెనీలకు నిధులు సమకూరుతాయనే ఆశావహ అంచనాలతో సోమవారం అమెరికా ఈక్విటీ సూచీలు భారీ నష్టాలను పూడ్చుకొని 0.6-1.4 శాతం మధ్య లాభంతో ముగిశాయి. నేడు మన మార్కెట్ ప్రారంభ సమయానికి ఆసియాలో ప్రధాన దేశాలకు చెందిన సూచీలన్నీ భారీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. అత్యధికంగా కొరియా ఇండెక్స్ 4.5శాతం లాభపడింది. జపాన్ సూచి 3.50శాతం, హాంగ్‌కాంగ్ ఇండెక్స్ 3శాతం, ఇండోనేషియా, సింగపూర్ తైవాన్ దేశాలకు చెందిన సూచీలు 2.50శాతం పెరిగాయి. అలాగే చైనా సూచీ 1శాతం లాభంతో ట్రేడ్ అవుతోంది.
నిఫ్టీ-50లో ఒక్క గెయిల్ షేరు మాత్రమే అరశాతం నష్టంతో ట్రేడ్ అవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యూపీఎల్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూస్టీల్ షేర్లు 5శాతం లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment