
దేశీయ మార్కెట్ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 66 పాయింట్లు పెరిగి 30262 వద్ద, నిఫ్టీ 8 పాయింట్లు లాభంతో 8887 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సూచీలకిది వరుసగా రెండో రోజూ లాభాల ప్రారంభం కావడం విశేషం. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్ 328 పాయింట్ల లాభంతో 30,524.53 వద్ద నిఫ్టీ 96 పాయింట్లు పెరిగి 8,975.50 వద్ద ట్రేడ్ అవుతోంది. అటో, ఐటీ రంగాలకు చెందిన షేర్లు మాత్రమే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ రంగ షేర్లు లాభపడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ 0.79శాతం లాభంతో 17, 625 వద్ద ట్రేడ్ అవుతోంది.
కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ పరిమితులను చాలా దేశాలు సడలించినప్పటికీ.., ఆయా దేశాలు వెలువరించిన ప్రతికూల ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహరిచాయి. ఫలితంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో సెంటిమెంట్ కొంత బలహీనంగా ఉంది.
గత 2 ట్రేడింగ్ సెషన్ల నుంచి ఎఫ్‌పీఐల అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తుండటం మన మార్కెట్‌కు కలిసొచ్చే అంశంగా మారింది. ఇక బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ తో 22 కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించవచ్చు.
కోవిద్-19 వైరస్ వ్యాధి నివారణకు మోడ్నెర్ ఔషధ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్ ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయిందని అమెరికా అధికారిక మెడికల్ న్యూస్ వెబ్‌సైట్ ఎస్‌టీఏటీ ప్రకటించింది. ఫలితంగా మంగళవారం రాత్రి అమెరికా మార్కెట్ నష్టాలను చవిచూసింది. ఈ దేశ ప్రధాన ఈక్విటీ సూచీలైన డౌజోన్స్ ఇండెక్స్ 1.50శాతం, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్ 1శాతం, నాస్‌డాక్ ఇండెక్స్ అరశాతం నష్టంతో ముగిశాయి.
ఇక ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్, తైవాన్, కొరియా దేశాల సూచీలు 1శాతం నుంచి అరశాతం వరకు లాభపడగా, చైనా, సింగపూర్, ఇండోనేషియా దేశాల సూచీలు అరశాతం నష్టపోయాయి.
క్రూడాయిల్‌ను ఉత్పత్తి చేసే దేశాలు ఉత్పత్తిలో కోత విధించవచ్చనే అంచనాలున్పటికీ అంతర్జాతీయ వృద్ధి ఆందోళనలతో క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ చమురు ధర 34.55డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది.
గెయిల్, శ్రీ సిమెంట్, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ షేర్లు 1.50శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి. కోల్ ఇండియా, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరోమోటోకార్ప్, ఇన్ఫ్రాటెల్ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment