ఆర్‌బీఐ పాలసీ, గణాంకాలు కీలకం
⇒ శ్రీరామ నవమి సందర్భంగా మంగళవారం సెలవు
⇒ ట్రేడింగ్ నాలుగు రోజులే
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ ద్రవ్య విధానం.. ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకం కానున్నదని నిపుణులంటున్నా రు. శ్రీరామ నవమి సందర్భంగా మంగళవారం(ఈ నెల 4న) స్టాక్ మార్కెట్‌కు సెలవు. కావున ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది కాబట్టి గురువారం (ఈ నెల 6న) వెలువడే ఆర్‌బీఐ పాలసీతో పాటు తయారీ, సేవల రంగాలకు చెందిన గణాంకాల ప్రభా వం మార్కెట్‌పై ఉంటుందని విశ్లేషకులంటున్నారు.
ఒడిదుడుకులు తప్పవు...!
మార్కిట్ ఎకనామిక్స్ సంస్థ భారత తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) గణాంకాలను సోమవారం వెలువరిస్తుంది. ఇదే సంస్థ సేవల రంగానికి చెందిన పీఎంఐ గణాంకాలను గురువారం వెల్లడిస్తుంది. ఈ గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుంది. మొత్తం మీద ఈ వారం మార్కెట్‌కు ఒడిదుడుకులు తప్పవని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ డైరెక్టర్ అభ్నిష్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. ఆర్‌బీఐ పాలసీని బట్టి మార్కెట్ భవిష్యత్ గమనం ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన వి.కె. శర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. డాలర్‌తో రూపాయి మారకం, ఆర్‌బీఐ పాలసీ ఈ రెండు అంశాలు.. సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు.
వెలుగులో వాహన షేర్లు..
మార్చిలో అమ్మకాలు బాగా ఉన్నందున వాహన కంపెనీల షేర్లు జోరుగా ఉండొచ్చని నిపుణులంటున్నారు. ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ కారణంగా వడ్డీరేట్ల ప్రభావిత షేర్లలో ఒడిదుడుకులు ఉండొచ్చని రెలిగేర్ సెక్యూరిటీస్‌కు చెందిన జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ఇంధన ధరల తగ్గింపు ప్రభావం ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీలపై ఉంటుంది. మరోవైపు విమానయాన ఇంధనం ధరలు 5 శాతం వరకూ తగ్గినందున స్పైస్‌జెట్, జెట్ ఎయిర్‌వేస్, ఇంటర్‌గ్లోబల్ ఏవియేషన్ షేర్లు లాభపడే అవకాశాలున్నాయి.
మార్చిలో రికార్డ్ స్థాయి విదేశీ పెట్టుబడులు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)లు గత నెలలో రూ.57,000 కోట్ల మేర మన క్యాపిటల్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టారు. మరిన్ని సంస్కరణలు వస్తాయనే అంచనాలతో ఈ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఎఫ్‌పీఐలు మన స్టాక్ మార్కెట్లో రూ.31,327 కోట్లు, డెట్‌మార్కెట్లో రూ.25,617 కోట్లు... వెరశి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.56,944 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 2002 తర్వాత ఒక్క నెలలో ఈ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి.