పీఎన్‌బీ స్కామ్ ప్రధాన సూత్రధారి నీరవ్ మోదీ
లండన్ : పీఎన్‌బీ స్కామ్‌లో రూ వేల కోట్లు నిండా ముంచిన డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ బ్రిటన్‌లో రాజకీయ ఆశ్రయం కోసం పాకులాడుతున్నట్టు తెలిసింది. కుంభకోణం వెలుగుచూడక ముందే లండన్‌లో తలదాచుకున్న నీరవ్ మోదీ, ఆయన బంధువు గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సీలు ఈ మేరకు లాబీయింగ్ చేస్తున్నట్టు ఓ కథనం వెల్లడైంది. పీఎన్‌బీని మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ, చోక్సీల వ్యవహారంపై దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. రూ 13,000 కోట్లకు పైగా అక్రమంగా రుణాలు పొందిన నీరవ్ మోదీ ఇతరులపై పీఎన్‌బీ ఫిర్యాదు నేపథ్యంలో మోదీ, చోక్సీలతో పాటు వారికి సహకరించిన బ్యాంకు అధికారులు, ఇతరులపై ఈడీ సహా పలు దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి.
నీరవ్ కంపెనీ ఒక స్టోర్‌ను కలిగిఉన్న లండన్‌లోనే నీరవ్ మకాం వేశారని రాజకీయ ఆశ్రయం పొందేందుకు అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికారులు చెబుతున్నారని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. భారత్‌తో తమ సంబంధాలను ఈ తరహా సున్నితమైన కేసులు కొంత అలజడి రేపుతాయని, ఏమైనా ఇరు దేశాలు న్యాయప్రక్రియకు అనుగుణంగా వీటిని ఎదుర్కొంటాయని, అయితే ఈ క్రమంలో తాము మానవ హక్కుల పరిరక్షణ చట్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యాలయ అధికారి తెలిపినట్టు ఈ కథనం వెల్లడించింది.
కాగా ఈ కేసులో సీబీఐ ఈ ఏడాది మేలో ముంబయి కోర్టు ఎదుట రెండు చార్జిషీట్‌లను నమోదు చేసింది. ఇక నీరవ్ మోదీ ఆయన అనుచరులపై ఈడీ మరో చార్జిషీట్‌ను న్యూఢిల్లీలో ప్రత్యేక కోర్టులో నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment