న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాంలో ప్రధాన సూత్రధారి అయిన నీరవ్ మోదీకి అరెస్ట్ భయం పట్టుకుంది. నీరవ్ మోదీని అరెస్ట్ చేయాలని భారత్ పెట్టుకున్న ప్రతిపాదనకు హాంకాంగ్ అధికారులు ఒప్పుకోవడంతో, ఆయన అక్కడ నుంచి కూడా పారిపోయినట్టు తెలుస్తోంది. హాంకాంగ్ నుంచి నీరవ్ మోదీ న్యూయార్క్ తరలి వెళ్లినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాదాపు రూ.13,600 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌మోదీ, ఆ స్కాం బయటికి రాకముందే భారత్ విడిచి పారిపోయాడు. భారత్ నుంచి పారిపోయి యూఏఈలో తలదాచుకున్నాడు. అయితే అక్కడ కఠినతరమైన శిక్షలు ఉండటంతో, వెంటనే హాంకాంగ్ వెళ్లినట్టు తెలిసింది. ఫిబ్రవరి 2 నుంచి నీరవ్ మోదీ హాంకాంగ్‌లో ఉన్నట్టు భారత అధికారులు గుర్తించారు. నీరవ్‌ను అరెస్ట్ చేయాలంటూ హాంకాంగ్ అధికారులను కోరుతూ భారత్ ఓ అభ్యర్థనను సైతం పంపింది. అలాగే పీఎన్‌బీ బ్యాంకు కూడా హాంకాంగ్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హాంకాంగ్‌లో ఉండటం కూడా ప్రమాదకమేనని భావించిన నీరవ్ మోదీ, వెంటేనే న్యూయార్క్ వెళ్లినట్టు రిపోర్టు పేర్కొన్నాయి.
మోదీ ఒరిజినల్ పాస్‌పోర్ట్‌రద్దు చేసినప్పటికీ, అతని వద్ద మరో పాస్‌పోర్టు ఉందని, దాంతోనే ఒక దేశం నుంచి మరో దేశానికి పారిపోవడానికి సహకరిస్తున్నట్టు తెలిపాయి. మోదీ కేవలం బ్యాంకులను ముంచడమే కాకుండా.. నకిలీ పాస్‌పోర్ట్ కలిగి ఉండి చట్టాలను, నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు తెలిసింది. నిబంధనల ప్రకారం భారత పౌరులు ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉండటానికి అనుమతి లేదు. మరోవైపు బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి పత్తా లేకుండా పోయిన డిఫాల్ట్రర్లను వెతికి పట్టుకునేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు డిటెక్టివ్‌ల సాయం తీసుకుంటోంది. ఇందు కోసం సర్వీసులు అందించేందుకు డిటెక్టివ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులను సైతం ఆహ్వానిస్తోంది. పత్తా లేకుండా పోయిన లేదా బ్యాంకు రికార్డుల్లోని చిరునామాల్లో లేని రుణగ్రహీతలు, గ్యారంటార్లతో పాటు వారి వారసుల ఆచూకీని దొరకపుచ్చుకునేందుకు ఈ డిటెక్టివ్ ఏజెన్సీలు తోడ్పాటు అందించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment