
తిరువనంతపురం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మళ్లీ లాభాల్లోకి మళ్లగలమని, వృద్ధి బాట పట్టగలమని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఎండీ సునీల్ మెహతా ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకును ముంచేసిన నీరవ్ మోదీ స్కామ్ ఇక ముగిసిన అధ్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు రూ.13,000 కోట్ల మోదీ స్కామ్‌తో కుదేలైన పీఎన్‌బీ .. ఇంకా ఆ ప్రభావాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మెహతా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
గత ఆర్థిక సంవత్సరం రూ.12,282 కోట్ల నష్టం ప్రకటించిన పీఎన్‌బీ.. జూన్ క్వార్టర్‌లో మరో రూ.940 కోట్ల నష్టం నమోదు చేసింది. బాకీలు రాబట్టుకునేందుకు తీసుకుంటున్న వివిధ చర్యల ఊతంతో 2018–19లో బ్యాంకు మళ్లీ లాభాల్లోకి రాగలదని మెహతా చెప్పారు. పీఎన్‌బీ క్రమంగా వృద్ధి బాట పడుతోందని.. రుణ వృద్ధి ఊపందుకోవడంతో పాటు పరిశ్రమ సగటు స్థాయిని కూడా మించిందని ఆయన వివరించారు. వరద బాధితుల సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కు రూ. 5 కోట్ల విరాళం అందించిన సందర్భంగా మెహతా ఈ విషయాలు తెలిపారు.
కార్యకలాపాల విస్తరణ కోసం ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా కేంద్రం నుంచి రూ. 5,431 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేంద్రం ఇటీవలే ఇచ్చిన రూ. 2,816 కోట్లు.. మూలధనానికి సంబంధించి నియంత్రణ సంస్థల పరమైన నిబంధనల పాటింపునకు ఉద్దేశించినవని మెహతా చెప్పారు. మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థకు కేంద్రం అందించనున్న రూ.65,000 కోట్లలో పీఎన్‌బీకి రూ.8,247 కోట్లు లభించగలవని ఆయన వివరించారు. అక్టోబర్ 30న అసాధారణ సర్వసభ్య సమావేశంలో షేర్‌హోల్డర్ల నుంచి, ఆ తర్వాత నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం లభించాక బ్యాంకుకు నిధులు అందనున్నాయని మెహతా పేర్కొన్నారు.