న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రభావం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న రంగాలకు ఆర్థిక ప్యాకేజీని వీలైనంత త్వరలో ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం భరోసానిచ్చారు. అయితే, ఇందుకు ఎన్ని రోజులు పడుతుందన్న వివరాలను ఆమె వెల్లడించలేదు. పౌర విమానయానం, పర్యాటకం, ఎంఎస్‌ఎంఈ, పశుసంవర్థక శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి సీతారామన్ ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆయా శాఖల నుంచి వచ్చిన డిమాండ్లపై విస్తృతంగా చర్చించినట్టు మంత్రి తెలిపారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు శనివారం అంతర్గతంగా మరో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రధాని ప్రకటించిన కోవిడ్–19 ఎకనమిక్ రెస్పాన్స్ టీమ్ ఇంకా ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. ఆర్థిక రంగానికి సంబంధించి ఉపశమన చర్యల గురించి మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు.. సెబీ ప్రకటించిన నియంత్రణ చర్యలు మార్కెట్లలో కొంత స్థిరత్వాన్ని తీసుకొస్తాయన్నారు. ప్రస్తుత స్థితిలో ప్రతీ ఒక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకుని వాటిపై పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టు చెప్పారు.
పర్యాటకానికి గడ్డు పరిస్థితి
‘‘పర్యాటక రంగంపై ప్రభావం ఉన్న విషయం మన అందరికీ తెలుసు. ఈ రంగానికి వచ్చే నష్టాల గురించి పూర్తి అధ్యయనం అనంతరం ఏదైనా ప్యాకేజీ ప్రకటించే అంశాన్ని నిర్ణయిస్తాం’’ అని పర్యాటక మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ తెలిపారు.
ఆర్థిక సాయం అవసరం : క్రిసిల్
తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్స్, హోటల్స్, మాల్స్, మల్టీప్లెక్సులు, రెస్టారెంట్లు, రిటైలర్లకు స్వల్ప, మధ్యకాలిక ఆర్థిక సాయం వెంటనే అందించాలని క్రిసిల్ తన నివేదికలో కోరింది. చైనాలో కొత్తగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో మే చివరినాటికి సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వివరించింది. ఇది జరక్కపోతే స్టీల్, జెమ్స్, జువెల్లరీ, కన్‌స్ట్రక్షన్, ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ రంగాలూ కరోనా బారిన పడతాయని హెచ్చరించింది.
నగదు రాక తగ్గింది..: ఫిక్కీ
దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 50 శాతంపైగా కంపెనీల కార్యకలాపాలపై ప్రభావం చూపుతోందని ఫిక్కీ తెలిపింది. ఫిక్కీ నిర్వహించిన సర్వేలో 80 శాతం కంపెనీలు నగదు రాక తగ్గినట్టు తెలిపాయి. కరోనాతో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, డిమాండ్. సరఫరా దెబ్బతిందని ఫిక్కీ వివరించింది. ఉద్యోగుల వేతనాలు, వడ్డీ, రుణ చెల్లింపులపై ప్రభావం ఉంటుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్‌బీఐ పాలసీ రేట్లను 100 బేసిస్ పాయింట్లు తగ్గించాలని ఫిక్కీ కోరింది.
నగదు సాయం చేయండి : సీఐఐ
పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పన్ను తగ్గింపులు, వడ్డీ రేట్ల కోతతోపాటు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీ పన ప్రకటించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరింది. వ్యాపారాలకు భారీ అంతరాయం రానుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. కరోనా మూలంగా రియల్టీ, విమానయా నం, పర్యాటక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. ‘ఆధార్ ఆధారంగా గ్రామీణ, పట్టణ నిరుపేదలకు ఒక్కొక్కరికీ రూ.5,000 నేరుగా వారి ఖాతాకు జమచేయాలి. బలహీన వర్గాలు, వృద్ధులకు రూ.10,000 అందించండి. వ్యక్తుల్లో ఆర్థిక భయాలను తొలగించేందుకు ఇది దోహదం చేస్తుంది’ అని తన లేఖలో తెలిపారు.
వేతనాలను తగ్గించుకోవాలి..
వ్యయ భారం తగ్గేందుకు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ స్థాయిలో వేతనాలను కుదించుకోవాలి అని చంద్రజిత్ సూచించారు. ‘ప్రభుత్వం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 10 శాతమున్న పన్నును ఎత్తవేయాలి. టోటల్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను 25 శాతానికి చేర్చాలి. ఇన్వాయిస్‌ల ఆధారంగా కాకుండా బిల్లుల వసూళ్లపై మాత్రమే జీఎస్టీ అమలు చేయాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment