నిస్సాన్‌ చీఫ్‌ ఘోన్‌ అరెస్ట్‌ | Nissan boss Carlos Ghosn's arrest in Japan shocks auto industry | Sakshi
Sakshi News home page

నిస్సాన్‌ చీఫ్‌ ఘోన్‌ అరెస్ట్‌

Published Tue, Nov 20 2018 12:42 AM | Last Updated on Tue, Nov 20 2018 12:42 AM

Nissan boss Carlos Ghosn's arrest in Japan shocks auto industry - Sakshi

టోక్యో: ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఆటోమొబైల్‌ దిగ్గజం నిస్సాన్‌ చైర్మన్‌ కార్లోస్‌ ఘోన్‌ అరెస్టయ్యారు. తన ఆదాయాన్ని తక్కువగా చూపించటం సహా పలు అవకతవకలకు పాల్పడినట్లు ప్రాసిక్యూటర్ల విచారణలో వెల్లడైందని, దీంతో ఆయన్ను అరెస్ట్‌ చేశారని జపాన్‌ వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. ‘ఆర్థిక సాధనాలు, విదేశీ మారక చట్టం నిబంధనల్ని ఉల్లంఘించారన్న అభియోగాలతో నిస్సాన్‌ చైర్మన్‌ ఘోన్‌ను టోక్యో జిల్లా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం అరెస్టు చేసింది‘ అని ఈ సంస్థ తెలియజేసింది.

మరోవైపు, ప్రజావేగు నివేదిక మేరకు ఘోన్‌పై గత కొద్ది నెలలుగా అంతర్గతంగా విచారణ సాగిస్తున్నట్లు నిస్సాన్‌ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. చాలా ఏళ్లుగా మరో అధికారితో కలిసి అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలొచ్చాయని వివరించింది. దీంతో ఘోన్, రిప్రెజెంటేటివ్‌ డైరెక్టర్‌ గ్రెగ్‌ కెల్లీపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. ‘ఘోన్‌ అందుకునే జీతభత్యాలను తక్కువగా చేసి చూపించేందుకు ఆయన, కెల్లీ కలిసి టోక్యో స్టాక్‌ ఎక్సే్చంజీకి పలు సంవత్సరాలుగా తప్పుడు సమాచారం అందిస్తున్నారని మా విచారణలో వెల్లడైంది.

అంతేగాకుండా ఘోన్‌పై దుష్ప్రవర్తన ఆరోపణలూ ఉన్నాయి. కంపెనీ ఆస్తుల్ని సొంతానికి వాడుకోవడం వంటివి చేశారు. ఈ వ్యవహారాల్లో కెల్లీ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలింది. ఈ విషయాలన్నీ జపనీస్‌ ప్రాసిక్యూటర్లకు తెలియజేశాం. ఆయనతో పాటు కెల్లీని తక్షణం అన్ని హోదాల నుంచి తొలగించాలంటూ డైరెక్టర్ల బోర్డు ముందు ప్రతిపాదించనున్నాం’’ అని నిస్సాన్‌ తన ప్రకటనలో వివరించింది. ఘోన్‌ను ప్రాసిక్యూటర్స్‌ ప్రశ్నిస్తున్నారన్న వార్త అసాహి షింబున్‌ అనే స్థానిక వార్తాపత్రిక ద్వారా బైటికొచ్చింది.  అటుపై యోకోహామాలోని నిస్సాన్‌ ప్రధాన కార్యాలయంపై టోక్యో ప్రాసిక్యూటర్స్‌ దాడులు నిర్వహించనున్నట్లు ఎన్‌హెచ్‌కే వెల్లడించింది.  

ప్రశ్నార్థకంగా రెనో–మిత్సుబిషి కూటమి..
ఆటోమొబైల్‌ దిగ్గజాలు రెనో– నిస్సాన్‌– మిత్సుబిషిలను ఒకే తాటిపైకి తెచ్చిన ఘోన్‌ అరెస్టయిన నేపథ్యంలో ఈ కూటమి భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారవచ్చని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి బ్రాండ్‌ ఇమేజ్‌పై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. బ్రెజిల్‌కి చెందిన ఘోన్‌ (64) 1996– 99 మధ్య కాలంలో ఫ్రాన్స్‌ ఆటోమొబైల్‌ సంస్థ రెనోలో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా చేసి కంపెనీ పునరుద్ధరణలో కీలకపాత్ర పోషించారు. వ్యయాల్లో కోత పెట్టడంలో నిరంకుశంగా వ్యవహరిస్తారనే పేరుపొందారు. 1999లో ఘోన్‌.. జపాన్‌కి చెందిన నిస్సాన్‌ను పునరుద్ధరించే బాధ్యతలను చేపట్టారు.

ఈ సందర్భంగా కఠిన వ్యయ నియంత్రణ చర్యలు అమలు చేశారు. అయిదు ఫ్యాక్టరీలను మూసివేసి, 21,000 ఉద్యోగాలను తగ్గించి, తద్వారా మిగిలిన నిధులను మూడేళ్లలో కొత్తగా 22 కార్లు, ట్రక్‌ మోడల్స్‌ను ప్రవేశపెట్టడంపై ఇన్వెస్ట్‌ చేశారు. మొత్తం మీద ఫోక్స్‌వ్యాగన్, టయోటాలకు దీటైన పోటీనిచ్చే సంస్థలుగా నిస్సాన్, రెనోలను తీర్చిదిద్దారు. 2016లో మిత్సుబిషి సంస్థను గట్టెక్కించేందుకు నిస్సాన్‌ 2.2 బిలియన్‌ డాలర్లతో మూడో వంతు వాటాలు కొనుగోలు చేసింది.

దానికి కూడా సారథ్య బాధ్యతలు చేపట్టిన ఘోన్‌... రెనో, నిస్సాన్,మిత్సుబిషిలతో ఒక కూటమి తయారుచేశారు. ఈ క్రమంలో ఆయన అందుకుంటున్న జీత భత్యాలపై చాన్నాళ్లుగా విమర్శలు వస్తున్నాయి. రెనో–నిస్సాన్‌–మిత్సుబిషి కూటమి చైర్మన్‌గా, రెనో సీఈవోగా, నిస్సాన్‌..మిత్సుబిషి సంస్థల చైర్మన్‌గా ఆయన వివిధ హోదాల్లో జీతభత్యాలు అందుకునేవారు. కానీ నియంత్రణ సంస్థలకు మాత్రం వీటిని తగ్గించి చూపేవారని ఆరోపణలున్నాయి. ఈ వివాదమే తాజాగా ఆయన అరెస్టుకు దారితీసింది.

ఘోన్‌ను చైర్మన్‌ హోదా నుంచి తొలగించే ప్రతిపాదనపై గురువారం బోర్డు సమావేశం కానున్నట్లు నిస్సాన్‌ సీఈవో హిరోటో సైకావా తెలిపారు. రెనో, మిత్సుబిషితో తమ లావాదేవీలపై ఘోన్‌ అరెస్టు, తొలగింపు ప్రభావమేమీ ఉండబోదని ఆయన పేర్కొన్నారు. ఒకే ఎగ్జిక్యూటివ్‌కి అపరిమితమైన అధికారాలు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement