హైవే ప్రాజెక్టుల్లోకి చైనాకు నో వే! | No Chinese Company To Be Allowed To Bid, Nitin Gadkari | Sakshi
Sakshi News home page

హైవే ప్రాజెక్టుల్లోకి చైనాకు నో వే!

Published Thu, Jul 2 2020 12:59 PM | Last Updated on Thu, Jul 2 2020 1:17 PM

No Chinese Company To Be Allowed To Bid, Nitin Gadkari - Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాను గట్టిగా ఎదుర్కొన్న భారత్‌ తాజాగా డ్రాగన్‌ను వ్యాపార కార్యకలాపాలపరంగా కూడా కట్టడి చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా చైనా సంస్థలను జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల్లో అనుమతించకుండా చర్యలు తీసుకుంటోంది. జాయింట్‌ వెంచర్ల ద్వారా సైతం చైనీస్‌ సంస్థలకు అనుమతులు ఉండబోవంటూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. అలాగే, లఘు, చిన్న, మధ్యతరహా సంస్థల్లాంటి (ఎంఎస్‌ఎంఈ) పలు రంగాల్లో చైనా ఇన్వెస్టర్లకూ ఎంట్రీ ఉండబోదని ఆయన పేర్కొన్నారు. ‘చైనా భాగస్వాములు ఉన్న జాయింట్‌ వెంచర్‌ సంస్థలకు రహదారుల నిర్మాణ ప్రాజెక్టులకి అనుమతించం’ అని మంత్రి తెలిపారు.  (దేశీ యాప్స్‌ హుషారు..)

త్వరలో కొత్త విధానం.. 
చైనా సంస్థలను నిషేధిస్తూ, హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనేలా దేశీ కంపెనీల అర్హత ప్రమాణాలను సడలించేందుకు త్వరలోనే విధానాన్ని ప్రకటించనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టుల్లో మాత్రమే కొంత మేర చైనా భాగస్వామ్య సంస్థలు ఉన్నాయన్నారు. కొత్త నిబంధనలు ప్రస్తుత, భవిష్యత్‌ టెండర్లకు వర్తింపచేస్తామని తెలిపారు. ఇక టెండర్ల విషయానికొస్తే.. చైనా జాయింట్‌ వెంచర్లున్న వాటికి సంబంధించి రీబిడ్డింగ్‌ ఉంటుందని గడ్కరీ చెప్పారు. ‘భారీ ప్రాజెక్టులకు మన కంపెనీలూ అర్హత సాధించేలా చూసేందుకు నిబంధనలు సడలించాలని నిర్ణయం తీసుకున్నాము. సాంకేతిక, ఆర్థిక నిబంధనలపై చర్చించాల్సిందిగా హైవేస్‌ విభాగం కార్యదర్శి, నేషనల్‌ హైవేస్‌ అథారిటీ చైర్మన్‌లకు సూచించాను. చిన్న ప్రాజెక్టులకు అర్హత సాధించగలిగే కాంట్రాక్టర్లు పెద్ద ప్రాజెక్టులకు కూడా అర్హత సాధించవచ్చు. ప్రస్తుత నిర్మాణ నిబంధనలు సరిగ్గా లేవు. భారతీయ కంపెనీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో  వాటిని మారుస్తున్నాం‘ అని గడ్కరీ వివరించారు. ప్రాజెక్టుల కోసం విదేశీ సంస్థలతో జాయింట్‌ వెంచర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా నిబంధనలను క్రమబద్ధీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ టెక్నాలజీ, కన్సల్టెన్సీ లేదా డిజైన్‌ వంటి విభాగాల్లో జేవీలు అవసరమైనా, చైనా సంస్థలకు మాత్రం అనుమతి ఉండబోదన్నారు.  

ఎంఎస్‌ఎంఈల్లోకి విదేశీ పెట్టుబడులు .. 
దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అదే సమయంలో ఎంఎస్‌ఎంఈల్లోకి విదేశీ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తున్నామని గడ్కరీ చెప్పారు. అయితే, ఈ విషయంలో చైనా ఇన్వెస్టర్లను మాత్రం అనుమతించబోమన్నారు.మరోవైపు, చైనా నుంచి వచ్చిన కన్‌సైన్‌మెంట్స్‌ను భారతీయ పోర్టుల్లో అధికారులు నిలిపివేస్తున్నారన్న వార్తలపై స్పందిస్తూ ఇది కావాలని చేస్తున్నదేమీ కాదని మంత్రి చెప్పారు. స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశీ వ్యాపారాలు, ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోందని, సాధారణంగానే చైనా నుంచి దిగుమతులను తగ్గాలనుకుంటోందని తెలిపారు. చైనాతో తాజా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తక మునుపు 2–3 నెలల క్రితమే బుక్‌ చేసుకున్న కన్‌సైన్‌మెంట్స్‌కు సత్వరం క్లియరెన్స్‌ ఇవ్వాలంటూ ఆయా విభాగాలకు సూచించినట్లు గడ్కరీ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement