ఆర్‌బీఐ అనుమతిలేకుండా మాఫీ ప్రకటనా? | no clarity on debt waiver scheme | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ అనుమతిలేకుండా మాఫీ ప్రకటనా?

Published Wed, Jul 16 2014 2:50 AM | Last Updated on Wed, Aug 15 2018 7:56 PM

ఆర్‌బీఐ అనుమతిలేకుండా మాఫీ ప్రకటనా? - Sakshi

ఆర్‌బీఐ అనుమతిలేకుండా మాఫీ ప్రకటనా?

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  ఆర్‌బీఐ అనుమతి లేకుండా రుణ మాఫీ పథకాన్ని ఎలా ప్రవేశపెడతారని, రాజకీయ పార్టీల అనాలోచిత నిర్ణయాల వల్ల బ్యాంకింగ్ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, ఇలా మాట్లాడాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉందంటూ కెనరా బ్యాంక్ సీఎండీ ఆర్.కె.దుబే తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు.

రుణ మాఫీ పథకంపై స్పష్టత లేకపోవడంతో కట్టే స్తోమత ఉన్న వారు కూడా రుణాలు చెల్లించడం లేదని, దీంతో పెరుగుతున్న ఎన్‌పీఏలు బ్యాంకింగ్ రంగాన్ని గడ్డు పరిస్థితుల్లోకి నెడుతున్నాయంటూ వాపోయారు. మంగళవారం హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చన దుబే కలిసిన విలేకరులతో మాట్లాడుతూ రుణ మాఫీ పథకంపై ఆర్‌బీఐతో పాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా ఒక స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బకాయిలు వసూలు కాకపోవడంతో దీని ప్రభావం కొత్త రుణాల మంజూరుపై ప్రభావం చూపుతుందని, తద్వారా రైతులు దెబ్బతింటారన్నారు.

కొత్త రుణాల మంజూరుపై ఎటువంటి ఆంక్షలు లేనప్పటికీ, ఎన్‌పీఎల ఒత్తిడి వల్ల బ్యాంకు మేనేజర్లు కొత్త రుణాల మంజూరుపై ఆసక్తి చూపలేరని ఒక ప్రశ్నకు సమాధానంగా దుబే తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాపార విస్తరణపై ఈ నిర్ణయం ప్రభావం చూపదని, రెండు రాష్ట్రాల్లో ఈ ఏడాది కొత్తగా మరో 150 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కెనరా బ్యాంకుకు 350 శాఖలున్నాయి.

 రూ. 3,000 కోట్ల క్విప్ ఇష్యూ
 వ్యాపార విస్తరణకు అవసరమైన నిధుల సేకరణకు త్వరలోనే క్విప్ ఇష్యూ ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఇష్యూకి ఆర్‌బీఐ నుంచి అనుమతి లభించిందని తృతీయ త్రైమాసికంలో ఇష్యూకు వచ్చే ఆలోచన ఉందన్నారు. దీంతో పాటు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూకు(ఎఫ్‌పీవో) వస్తామని, కాని దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. వచ్చే ఏడాదిలో ఎఫ్‌పీవోకి వచ్చే అవకాశం ఉందన్నారు. రుణాల రీకవరీ బాగుండటంతో ఈ ఏడాది చివరికి ఎన్‌పీఏలు తగ్గే అవకాశం ఉందన్నారు. మార్చి, 2014 నాటికి కెనరా బ్యాంక్ స్థూల ఎన్‌పీఏ 2.94%, నికర ఎన్‌పీఏలు 1.98%గా ఉన్నాయి.
 
ఓటీఎస్‌కి ఒకే అంటే కేసులు వెనక్కి తీసుకుంటాం... డీసీకి కెనరా బ్యాంక్ ఆఫర్
 డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్(డీసీహెచ్‌ఎల్) వన్ టైమ్ సెటిలిమెంట్ (ఓటీఎస్)కి ముందుకు వస్తే, ఆ సంస్థపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని కెనరా బ్యాంక్ ప్రకటించింది. చెల్లించలేకపోతున్న రుణాలను పునర్ వ్యవస్థీకరించాలంటూ డీసీహెచ్‌ఎల్ ప్రమోటర్లు తమను కలిసి కోరారని, కాని మేము సీబీఐ వద్ద మోసం కేసు నమోదు చేయడంతో ఇది సాధ్యం కాదని, అవసరమైతే ఓటీఎస్‌కి అవకాశం ఇస్తామని చెప్పినట్లు దుబే తెలిపారు.

 ఓటీఎస్ కింద నిర్ణయించి మొత్తాన్ని చెల్లించడానికి వస్తే కేసులు ఉపసంహరించుకుంటామని, ఇంతవరకు డీసీ ప్రమోటర్లు ముందుకు రాలేదన్నారు. ఓటీఎస్‌కి రాకపోతే ఈ ఎన్‌పీఏలను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించే ఆలోచనలో ఉన్నామని, సీబీఐ కేసు ఉండటంతో దీనికి ఆర్‌బీఐ నుంచి అనుమతి లభించాల్సి ఉందన్నారు. కెనరా బ్యాంక్‌కి డీసీహెచ్‌ఎల్ రూ.350 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. తప్పుడు తనఖా పత్రాలను పెట్టి రుణం తీసుకుంది అంటూ కెనరా బ్యాంక్ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇది విచారణలో ఉందని దుబే తెలిపారు.
 
 రెండో ఆర్థిక రాజధానిగా హైదరాబాద్  తెలంగాణ ఐటీ మంత్రి కె.తారకరామారావు
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో రెండవ ఆర్థిక రాజధానిగా ఎదగడానికి హైదరాబాద్‌కి అన్ని అర్హతలు ఉన్నాయని, ఇందుకు కావల్సిన అన్ని సహాయ సహకారాలను తమ ప్రభుత్వం అందిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. దేశ జీడీపీలో 25 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తుండటం, ఐఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం, ఆర్థిక జిల్లాతో పాటు అనేక ఆర్థిక సంస్థలు ఉండటంతో ముంబై తర్వాత ఆర్థిక రాజధానిగా హైదరాబాద్‌కు అన్ని హంగులు ఉన్నాయన్నారు.

గ్రామీణ ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేసే విధంగా క్షేత్రస్థాయి నుంచి బడ్జెట్ అంచనాలు తీసుకుంటున్నామని, కేవలం ప్రకటనలే కాకుండా నిధులు కూడా మంజూరు చేస్తామన్నారు. ఫిక్కీ నిర్వహిస్తున్న ‘ఫిన్‌సెక్-2014’ సదస్సుకు ముఖ్యఅతిథిగా హజరయ్యారు.  గ్రామీణ ఆర్థిక రంగాన్ని పటిష్టం చేయడానికి అవసరమైతే బ్యాంకులు, బీమా, సూక్ష్మ రుణ సంస్థల సహకారం తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వం రూ. లక్ష లోపు వ్యయసాయ రుణాల మాఫీకి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement