
న్యూఢిల్లీ: అధిక విలువ కలిగిన లావాదేవీలు నిర్వహించి 2018– 19 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయని వారు 21 రోజుల్లోపు వారి స్పందనను తెలియజేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) కోరింది. రిటర్నులు దాఖలు చేయని విషయమై ఐటీ శాఖ నుంచి ఈ మెయిల్ లేదా ఎస్‌ఎంఎస్ అందిన తేదీ నుంచి 21 రోజుల గడువు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ గడువులోపు ఎటువంటి రిటర్నులు లేదా స్పందన రాకపోతే ఆదాయపన్ను చట్టం 1961 కింద చర్యలు తీసుకుంటామని, ప్రొసీడింగ్స్ మొదలుపెడతామని స్పష్టంచేసింది.
భారీ లావాదేవీలు నిర్వహించిన కొందరు 2017–18 ఆర్థిక సంవత్సరానికి రిటర్నుల దాఖలు చేయలేదని పరిశీలనలో తేలినట్టు తెలిపింది. ఎంత మంది దాఖలు చేయలేదన్న దానిపై గణాంకాలను విడుదల చేయలేదు. రిటర్నులు దాఖలు చేయని వారు తాము చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని లెక్కించి 2018–19 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ సమర్పించాలని లేదా ఆన్‌లైన్‌లో 21 రోజుల్లోపు స్పందన తెలియజేయాలని కోరింది. ఇందు కోసం ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయవచ్చని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment