సమ్మె విరమణ బాటలో జువెలర్స్!
న్యూఢిల్లీ: దేశంలోని చాలా ప్రాంతాల్లో బంగారు ఆభరణాల క్రయవిక్రయాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. చాలా మంది జువెలర్స్ సమ్మె బాట వదిలి తిరిగి మంగళవారం బంగారు షాపులను తెరచారు. కేంద్ర ప్రభుత్వపు ఎక్సైజ్ సుంకం విధింపునకు నిరసనగా జువెలర్స్ 6 వారాల నుంచి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. న్యూఢిల్లీ, ముంబైలలో చాలా చోట్ల జువెలర్స్ బంగారు షాపులను తెరిచారు. ఏపీ, తమిళనాడులోని బంగారు షాపులు పునఃప్రారంభమయ్యాయి. ఇక ఎక్సైజ్ సుంకం అమలును సరళతరం చేస్తామన్న ప్రభుత్వపు హామీతో రాజస్తాన్‌లోనూ బంగారు షాపులు యథావిథిగా పనిచేస్తోన్నాయని రాజస్తాన్ సరాఫా సంఘం ప్రెసిడెంట్ సుభాశ్ మిట్టల్ తెలిపారు.
మహారాష్ట్ర జువెలర్స్ ఏప్రిల్ 14 నుంచి 24 వరకు సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. జువెలరీ పరిశ్రమ సమస్యలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి చర్చించామని, అందుకే ప్రస్తుతం సమ్మెను తాత్కాలికంగా విరమించామని మహారాష్ట్ర రాజ్య సరాఫా సువర్ణకార్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఫతేచంద్ రాంకా తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ.. జువెలర్స్ డిమాండ్లను పరిగణలోకి తీసుకుంటుందన్న ప్రభుత్వపు హామీతో జువెలర్స్ రానున్న రోజుల్లో సమ్మె విరమించవ త చ్చని అసోచామ్ నేషనల్ కౌన్సిల్ (జెమ్స్ అండ్ జువెలరీ) చైర్మన్ శంకర్ సేన్ తెలిపారు.