‘బ్రాండ్ ఇండియా’కు విదేశాల్లో విస్తృత ప్రచారం
వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ‘బ్రాండ్ ఇండియా’కు మరింత విస్త్రృత ప్రాచుర్యం కల్పించేందుకు వీలుగా భాగస్వాములతో తమ శాఖ ఆధ్వర్యంలో చర్చలు జరపనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశం వెలుపల బ్రాండ్ ఇండియాకు ప్రచారం కల్పించడం, పరిరక్షించుకోవడం అన్నది కేవలం పెట్టుబడులు రాబట్టడానికే కాదని, ప్రపంచ మార్కెట్లలోకి చొచ్చుకుపోయేందుకు చాలా కీలకమని మంత్రి చెప్పారు. దీని వల్ల దేశీయ మార్కెట్‌కు లబ్ధి కలుగుతుందన్నారు.
దీనిపై విస్తృత చర్చలకు వీలుగా ఓ రోజు సమావేశాన్ని నిర్వహించే యోచనలో ఉన్నట్టు చెప్పారు. విదేశాల్లో బ్రాండ్ ఇండియాను ముందుకు తీసుకెళ్లేందుకు సర్కారు ఏం చేయాలన్న దానిపై ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి వారైనా తమ ఆలోచనలు తెలియజేయవచ్చని సూచించారు. మంగళవారం ఢిల్లీలో ‘భారత్‌లో తయారీ’ అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. బ్రాండింగ్ సన్నాహాల్లో భాగంగా ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్‌ను వాణిజ్య శాఖ పునరుద్ధరించినట్టు ఆమె చెప్పారు.