మరో 9 స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు నోటీసులు
మరో 9 స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు నోటీసులు
Published Mon, Aug 21 2017 9:13 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
సాక్షి, న్యూఢిల్లీ : మరో 9 స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కేంద్రం నోటీసులు జారీచేసింది. యూజర్ల డేటా దుర్వినియోగం కాకుండా భద్రపర్చేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రక్రియల గురించి తెలియజేయాలంటూ ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కేంద్రం నోటీసులు పంపింది. నోటీసులు జారీచేసిన కంపెనీల్లో మోటోరోలో, ఆసుస్, హానర్, వన్‌ప్లస్, కూల్ ప్యాడ్, ఇన్‌ఫోకస్, బ్లూ, ఒప్పో, నుబియాలు ఉన్నాయి. ఇదే విషయంపై గత నాలుగు రోజుల క్రితమే 21 స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. వాటిలో ఎక్కువగా చైనా కంపెనీలే ఉన్నాయి. డివైజ్‌ను తయారుచేస్తున్నప్పుడు వారు తీసుకుంటున్న భద్రతా చర్యలు గురించి తెలుపాలని పేర్కొంది. ఆయా కంపెనీలు తమ వివరణ తెలియజేయడానికి ఆగస్టు 28 దాకా సమయం ఇచ్చినట్లు కేంద్ర ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
మొబైల్ ఫోన్ల నుంచి డేటా లీకవుతోందంటూ అంతర్జాతీయ స్థాయిలో నివేదికలు వస్తున్న నేపథ్యంలో తొలి దశలో డివైజ్‌లను, వాటిల్లో ముందస్తుగానే లోడ్ చేసిన సాఫ్ట్‌వేర్, యాప్స్‌ను నిశితంగా పరిశీలించడం జరుగుతుందని ఆయన వివరించారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ భద్రతా విషయంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఎక్కువగా దృష్టిపెట్టింది. మరోవైపు డోక్లాం ప్రాంతంపై భారత్, చైనా మధ్య ఉద్రికత్తలు నెలకొన్న తరుణంలో... కేంద్రం ఈ ఆదేశాలు జారీచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Advertisement
Advertisement