data security details
-
డేటా షేరింగ్‌పై సెబీ చర్చాపత్రం
డేటా గోప్యత, జవాబుదారీతనం మొదలైన పరిశోధనల కోసం డేటాను షేర్ చేసుకోవడానికి ప్రత్యేక విధానాలు రూపొందించుకోవాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. ఈమేరకు స్టాక్ ఎక్ఛ్సేంజీలు, ఇతర మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలు (ఎంఐఐ) సొంత విధానాలను ఏర్పాటు చేసుకోవాలని సెబీ తెలిపింది.వాణిజ్య అవసరాల కోసం షేర్ చేసుకునే డేటా గోప్యత, జవాబుదారీతనం..వంటి అంశాలపై సెబీ చర్చాపత్రాన్ని రూపొందించింది. సెబీలో భాగమైన మార్కెట్ డేటా అడ్వైజరీ కమిటీ(ఎండీఏసీ) సూచనల ప్రకారం మార్కెట్ డేటాకు బాధ్యత వహించాల్సిన సంస్థలు డేటా సేకరణ, ప్రాసెసింగ్, స్టోరేజ్, షేరింగ్, గోప్యత పాటించడం, యాక్సెస్ ఇవ్వడం మధ్య సమతూకంతో వ్యవహరించేలా తగు విధానాలను రూపొందించుకోవాలి. ఎంఐఐలు డేటాను రెండు కేటగిరీల కింద వర్గీకరించాలి. ఒకటి బహిరంగంగా షేర్ చేసుకునే డేటా. రెండు..గోప్యంగా ఉంచాల్సిన డేటా. కేవైసీ వివరాలు, వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు పరోక్షంగా ఉపయోగపడే డేటా రెండో కేటగిరీ పరిధిలోకి వస్తుంది. మార్కెట్లో స్థిరమైన విధానాలను పాటించేలా చూడటం ఈ పాలసీ లక్ష్యంగా సెబీ తెలిపింది. ఈ ప్రతిపాదనలపై అక్టోబర్ 29లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర! -
మరో 9 స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : మరో 9 స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కేంద్రం నోటీసులు జారీచేసింది. యూజర్ల డేటా దుర్వినియోగం కాకుండా భద్రపర్చేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రక్రియల గురించి తెలియజేయాలంటూ ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కేంద్రం నోటీసులు పంపింది. నోటీసులు జారీచేసిన కంపెనీల్లో మోటోరోలో, ఆసుస్, హానర్, వన్‌ప్లస్, కూల్ ప్యాడ్, ఇన్ఫోకస్, బ్లూ, ఒప్పో, నుబియాలు ఉన్నాయి. ఇదే విషయంపై గత నాలుగు రోజుల క్రితమే 21 స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. వాటిలో ఎక్కువగా చైనా కంపెనీలే ఉన్నాయి. డివైజ్‌ను తయారుచేస్తున్నప్పుడు వారు తీసుకుంటున్న భద్రతా చర్యలు గురించి తెలుపాలని పేర్కొంది. ఆయా కంపెనీలు తమ వివరణ తెలియజేయడానికి ఆగస్టు 28 దాకా సమయం ఇచ్చినట్లు కేంద్ర ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మొబైల్ ఫోన్ల నుంచి డేటా లీకవుతోందంటూ అంతర్జాతీయ స్థాయిలో నివేదికలు వస్తున్న నేపథ్యంలో తొలి దశలో డివైజ్‌లను, వాటిల్లో ముందస్తుగానే లోడ్ చేసిన సాఫ్ట్వేర్, యాప్స్‌ను నిశితంగా పరిశీలించడం జరుగుతుందని ఆయన వివరించారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ భద్రతా విషయంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఎక్కువగా దృష్టిపెట్టింది. మరోవైపు డోక్లాం ప్రాంతంపై భారత్, చైనా మధ్య ఉద్రికత్తలు నెలకొన్న తరుణంలో... కేంద్రం ఈ ఆదేశాలు జారీచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.