
ఎన్‌ఎస్‌ఈ డివిడెండ్ 730 శాతం
ఒక్కో షేర్‌కు రూ.73
హైదరాబాద్: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ)కి గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.240 కోట్ల నికర నష్టం వచ్చింది. సెటిల్మెంట్ గ్యారంటీ ఫండ్(ఎస్‌జీఎఫ్)కు రూ.694 కోట్ల బదిలీ కారణంగా ఈ స్థాయిలో నష్టం వచ్చిందని ఎన్‌ఎస్‌ఈ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) ఇదే క్వార్టర్‌లో రూ.121 కోట్ల నికర లాభం సాధించామని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.389 కోట్ల నుంచి రూ.411 కోట్లకు పెరిగిందని వివరించింది.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే... 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.780 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.439 కోట్లకు తగ్గిందని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,364 కోట్ల నుంచి రూ.1,480 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరానికి రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.73 డివిడెండ్(730 శాతం) ఇవ్వడానికి డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని పేర్కొంది.