ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు ముందు?
ఫైనాన్షియల్ బేసిక్స్..
ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుగా ప్రాధమిక ఆర్థిక అంశాలపై పట్టు సాధించాలి. ఆర్థిక వ్యవస్థలో చాలా రంగాలుంటాయి. బ్యాంకింగ్, ఆయిల్, స్టీల్, మైనింగ్, ఎఫ్‌ఎంసీజీ, సిమెంట్... ఇలా. మీరు ఏ ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాటి గురించి అధ్యయనం చేయాలి. ఉదాహరణకు స్టీల్ రంగాన్ని ఎంచుకొని అందులోని కంపెనీకి సంబంధించిన షేర్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ఆ రంగానికి సంబంధించిన అంశాలపై కన్నేసి ఉంచాలి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలి. అలాగే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న కంపెనీ, దాని కార్యకలాపాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. సమకాలీన దేశీ, అంతర్జాతీయ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను ఎప్పుడూ డైవర్సిఫైడ్‌గా ఉంచుకోవాలి. ‘అన్ని గుడ్లను ఒకే బాక్స్‌లో పెట్టకూడదు’ అనే సామెతను మనం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. అన్నీ ఒకే చోట ఉన్నప్పుడు.. బాక్స్ కిందపడితే ఏవీ మిగలవు. అన్నీ పగిలిపోతాయి.
అందుకే ఇన్వెస్ట్‌మెంట్లను కూడా ఒకే రంగ కంపెనీలపై పెడితే.. ఆ రంగం సరైన పనితీరును కనబరచకపోతే నష్టాలను చూడాల్సి వస్తుంది. అందుకే వివిధ రంగాలకు సంబంధించిన కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్నామంటే.. రిస్క్ కూడా భరించాల్సి ఉంటుందనే విషయాన్ని మరచిపోకూడదు. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో ఎప్పుడూ కూడా ఇతరుల సలహాలను పాటించొద్దు.