ముడిచమురు ముప్పు? | Oil dips but set for milestone run of weekly gains | Sakshi
Sakshi News home page

ముడిచమురు ముప్పు?

Published Sat, Apr 27 2019 12:20 AM | Last Updated on Sat, Apr 27 2019 12:20 AM

Oil dips but set for milestone run of weekly gains - Sakshi

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల భారత ఈక్విటీలకు అతిపెద్ద రిస్కని సీఎల్‌ఎస్‌ఏ ఈక్విటీ వ్యూహకర్త క్రిస్‌వుడ్‌ హెచ్చరించారు. మే2 తర్వాత ఇరాన్‌ చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షల మినహాయింపు ముగిసిపోతుందని, తదనంతరం బ్రెంట్‌ క్రూడ్‌ ధర వందడాలర్ల వరకు దూసుకుపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. వీలయినంతవరకు ఈక్విటీ పొజిషన్లను చమురు స్టాకులతో హెడ్జ్‌ చేసుకోవాలని ఇన్వెస్టర్లకు తన గ్రీడ్‌ అండ్‌ ఫియర్‌ నివేదికలో సలహా ఇచ్చారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన స్వరం మార్చుకునే చాన్సులు కూడా ఉన్నాయని వుడ్‌ అభిప్రాయపడ్డారు. చైనాతో వాణిజ్య యుద్ధంలో పైచేయి సాధించేందుకు ఇరాన్‌ చమురు కొనుగోలుపై ఆంక్షల అంశాన్ని ట్రంప్‌ వాడుకోవచ్చన్నారు. ప్రస్తుతం సౌదీ తన ఉత్పత్తి పెంచుకునేందుకు ట్రంప్‌ ఒత్తిడి తెస్తున్నా అంగీకరించడం లేదని, అందువల్ల అటు చైనా, ఇటు సౌదీలను దారిలో తెచ్చుకునేలా ఇరాన్‌ ఆయిల్‌పై ట్రంప్‌ స్వరం మారే అవకాశాలున్నాయని అంచనా వేశారు. ఈ ఏడాది అంతర్జాతీయ టెన్షన్ల కారణంగా చమురు ధరలు ఇంతవరకు దాదాపు 40 శాతం ర్యాలీ చేశాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ధర 75 డాలర్లను తాకింది. చమురు ధరల్లో అనూహ్య పెరుగుదల దేశీ కరెన్సీపై పడింది. దీంతో రూపీ 70 స్థాయిలకు పైన కదలాడుతోంది. ప్రస్తుతం ఇండియా స్టాక్‌ మార్కెట్‌పై సానుకూలంగా ఉన్నా, రూపాయిపై తాను ఆసక్తిగా లేనని వుడ్‌ చెప్పారు. రూపాయి వాస్తవ ఎక్చేంజ్‌ రేటు లెక్కన ఇంకా చౌకగా లేదని, ఆర్‌బీఐ పాలసీలో వచ్చిన మార్పుతో రూపాయికి రక్షణ తగ్గిందని వివరించారు. 

ఎన్నికలు– ఎకానమీ 
మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక ఆర్థ్ధిక నిర్ణయాల్లో నోట్లరద్దు, జీఎస్‌టీ ఎకానమీపై పెను ప్రభావం చూపాయి. వీటిలో నోట్లరద్దు ఆర్థిక వ్యవస్థకు అత్యంత చెరుపు చేసిందని వుడ్‌ అభిప్రాయపడ్డారు. నిజానికి ఎకానమీలో నల్లధనం ఏరివేతే నోట్లరద్దు ఉద్దేశమని, కానీ  అసంఘటిత రంగానికి నోట్ల రద్దు చాలా కీడు చేసిందని, ఇదే తరుణంలో వచ్చిన జీఎస్‌టీతో ఈ రంగానికి మరింత ఇక్కట్లు కలిగాయని చెప్పారు. ముఖ్యంగా బీజేపీకి ప్రధాన మద్దతుదారులైన చిన్న వ్యాపారస్థులకు జీఎస్‌టీ దెబ్బ గట్టిగా తగిలిందన్నారు. అయితే తాజా ఎన్నికల్లో తిరిగి మోదీనే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని, కానీ గతంలో కన్నా మెజార్టీ తగ్గవచ్చని అంచనా వేశారు. అందుకే మోదీ ఈ దఫా గుజరాత్‌లో సైతం గట్టిగా ప్రచారం చేస్తున్నారన్నారు. అంతేకాకుండా ఎకానమీ సంబంధిత అంశాలను ఆయన ప్రస్తావించడం లేదని, కేవలం జాతీయత, దేశభక్తి, పాక్‌కు గుణపాఠం వంటి అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారన్నారు.  

ఆందోళనలో ఆటోమొబైల్‌ 
ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల దేశీయ ఆటోమొబైల్‌రంగాన్ని ఇబ్బంది పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్‌ సరఫరా లోటు భర్తీ చేసేందుకు ఇతర దేశాలు ముందుకు వస్తున్నా, రాబోయే కొన్ని వారాల పాటు మాత్రం ముడిచమురు ధరలకు రెక్కలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో చమురు ఆధారిత రంగాలన్నీ క్రూడ్‌ ధర 90 డాలర్లను దాటకూడదని ఆశిస్తున్నాయి. ఒకవేళ క్రూడ్‌ 90 డాలర్లను దాటితే వెంటనే ఆర్థిక వ్యవస్థపై నెగిటివ్‌ ప్రభావం కనిపిస్తుంది. ఒకపక్క కొన్ని నెలలుగా దేశీ ఆటో విక్రయాలు మందగించాయి. ఇదే సమయంలో పెరుగుతున్న చమురు ధరలు ఆటో మొబైల్‌ పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవేళ క్రూడ్‌ 80 డాలర్లను చేరితే అసలే అంతంతమాత్రంగా ఉన్న విక్రయాలు మరింత దిగజారతాయని ప్రముఖ కంపెనీలు భయపడుతున్నాయి. క్రూడాయిల్‌ ధరల ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నాయి.  కొందరు నిపుణులు మాత్రం ముడిచమురు ధరలు మరింత పెరిగితే టూవీలర్‌ విక్రయాలు, అందునా అధిక మైలేజ్‌ ఇచ్చే వాహనాల విక్రయాలు ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎంట్రీలెవల్‌ బైక్స్, కాంపాక్ట్‌ కార్ల విక్రయాలు సైతం పాజిటివ్‌గా ఉండే చాన్సులున్నాయి.  

ఓఎంసీలకు గడ్డుకాలం! 
మరింత రాబడి కోసం చమురు మార్కెటింగ్‌ కంపెనీలపై(ఓఎంసీ) ప్రభుత్వం తెస్తున్న ఒత్తిళ్ల కారణంగా సమీప భవిష్యత్‌లో ఈ కంపెనీల ఫైనాన్షియల్‌ ప్రొఫైల్స్‌ ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఫిచ్‌ రేటింగ్స్‌ అభిప్రాయపడింది. ఓఎంసీల ఫలితాలు ఇబ్బందుల్లో పడితే వాటి క్రెడిట్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేసే అవకాశాలు పెరుగుతాయని హెచ్చరించింది. బడ్జెట్లో పేర్కొన్న డిజి న్వెస్ట్‌మెంట్‌ అంచనాలను అందుకునేందుకు ప్రభుత్వం తంటాలు పడుతోందని తెలిపింది. ఇందుకోసం నగదునిల్వలు భారీగా ఉన్న పీఎస్‌యూలను రెండో దఫా మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని, షేర్‌ బైబ్యాక్‌ చేపట్టాలని కోరుతోందని తెలిపింది. ఈ కంపెనీలు వచ్చే రెండేళ్ల కాలానికి రూపొందించుకున్న పెట్టుబడుల ప్రణాళికలకు బైబ్యాక్‌లు, డివిడెండ్‌లు విఘాతం కల్పిస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఓఐఎల్‌కు బీబీబీ నెగిటివ్‌ రేటింగ్, ఐఓసీ, బీపీసీఎల్‌కు బీబీ ప్లస్‌ రేటింగ్‌ ఉంది. క్రూడ్‌ ధర పెరిగినా ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఉంటే వీటికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.  

2008 రిపీట్‌?! 
ప్రస్తుత పరిస్థితులు 2008లో ముడిచమురు మార్కెట్‌ను గుర్తు చేస్తున్నాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అప్పట్లో ముడిచమురు ధరలు విపరీతంగా పరుగులు తీసి 150 డాలర్ల వరకు చేరాయి. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు ఉండకపోవచ్చని ఎక్కువమంది అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో ఎక్కువ దేశాల్లో చమురు ధరలపై ప్రభుత్వాల నియంత్రణ ఉండేది. కానీ ఇప్పుడు చాలా దేశాలు ఓపెన్‌ మార్కెట్‌కు మరలాయి. ఇండియాలో చమురు ధరలపై ప్రభుత్వ పెత్తనం ఉన్నంత వరకు ఎకానమీపై తీవ్ర ఒత్తిడి ఉండేది. ధర పెరిగే కొద్దీ ప్రభుత్వం సబ్సిడీలు పెంచుతూ పోవాల్సి వచ్చేది. కానీ గత నాలుగైదేళ్లుగా చమురు ధరలు బాగా దిగివచ్చాయి. చాలా రోజులు క్రూడ్‌ ధర 40 డాలర్ల వద్ద కదలాడింది. ఈ సమయంలో ప్రభుత్వానికి చాలా మిగులు కలిగింది. ఇదే సమయంలో చమురు ధరలపై నియంత్రణ ఎత్తివేయడం కూడా జరిగింది. అంతర్జాతీయంగా అమెరికా షేల్‌ గ్యాస్‌ అందుబాటులోకి వచ్చింది. అందువల్ల గతంలోలాగా ముడిచమురు 150 డాలర్లకు చేరకపోవచ్చని ఎక్కువమంది భావన.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement