న్యూఢిల్లీ: ఇరాన్ కమాండర్ ఖాసీమ్ సొలేమానిని అమెరికా హతమార్చడం.. భౌగోళిక ఉద్రిక్తతలకు దారి తీసింది. అంతర్జాతీయంగా అనిశ్చితి భయాలతో ఇన్వెస్టర్లు.. సురక్షిత సాధనాల వైపు మొగ్గు చూపారు. దీంతో బంగారం, క్రూడ్, డాలర్ ఇండెక్స్ శుక్రవారం భారీగా పెరిగాయి. వేర్వేరుగా ఆయా అంశాలపై దృష్టి సారిస్తే...
బంగారం: అంతర్జాతీయ ఫ్యూచర్స్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో శుక్రవారం బంగారం ఔన్స్ (31.1గ్రా) ధర 25 డాలర్లు ఎగసి 1,553.95 డాలర్ల స్థాయి తాకింది. పసిడికి ఇది నాలుగు నెలల గరిష్టస్థాయి. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో ఒక దశలో 10 గ్రాములు.. 24 స్వచ్ఛత పసిడి ధర రూ.791 లాభంతో రూ.40,068 వద్ద ట్రేడయ్యింది. గురువారంతో పోలి్చతే ఇది 2 శాతంకన్నా అధికం. వెండి కేజీ ధర కూడా ఒకశాతం పైగా పెరుగుదలతో రూ. 47,507 వద్ద ట్రేడయ్యింది. దేశంలోని పలు స్పాట్ మార్కెట్లలో కూడా పసిడి ధరలు రూ.40,000, వెండి ధరలు 51,000పైన ముగియడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర లాభాలతో.. 18.14 డాలర్లను తాకింది. రూపాయి బలహీనత కొనసాగి, అంతర్జాతీయంగా ధరలు పటిష్టంగా ఉంటే.. సోమవారం దేశీ స్పాట్ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
క్రూడ్: ఇక క్రూడ్ విషయానికి వస్తే, అంతర్జాతీయ మార్కెట్‌లో స్వీట్ నైమెక్స్ బ్యారల్ ధర ఒక దశలో 4 శాతం పెరిగి 64 డాలర్ల స్థాయిని తాకింది. మరోవైపు దాడులకు తీవ్ర ప్రతీకార చర్యలు తప్పవంటూ ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో బంగారం సహా క్రూడ్ ధర కూడా భారీగా పెరిగే అవకాశాలే ఉన్నాయన్నది నిపుణుల అంచనా. డాలర్ ఇండెక్స్ కూడా ఫ్యూచర్స్ మార్కెట్‌లో పటిష్టంగా (96.48) కొనసాగుతుండడం గమనార్హం.
రూపాయి... 42పైసలు పతనం
ముంబై: అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ కమాండర్ ఖాసీమ్ సోలేమని హతమవడం రూపాయిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. శుక్రవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ 42పైసలు పతనమైంది. నెలన్నర కనిష్టం 71.80కి పడిపోయింది. అమెరికా దాడి... ఇరాన్ హెచ్చరికలు.. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల భారీ పెరుగుదల... ఈక్విటీ మార్కెట్లకు నష్టాలు వంటి అంశాలు రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 71.56 వద్ద ప్రారంభమైన రూపాయి, ఒకదశలో 71.81ని కూడా చూసింది. వారంవారీగా రూపాయి 45 పైసలు నష్టపోవడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment