
ఓలాకి సాఫ్ట్‌బ్యాంక్ రూ. 1,675 కోట్లు
న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల సంస్థ ఓలాలో జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ తాజాగా రూ. 1,675 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఓలా మాతృసంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌లో రూ. 10 ముఖవిలువ గల 12,97,945 షేర్లను రూ. 12,895 ప్రీమియం ధరకు కొనుగోలు చేసింది. ప్రత్యర్థి సంస్థ ఉబెర్‌కి గట్టి పోటీనిచ్చేందుకు ఓలా ఈ నిధులను ఉపయోగించుకోనుంది. గతేడాది నవంబర్‌లో షేర్ల కేటాయింపు జరిగింది.
ప్రస్తుత పెట్టుబడుల రౌండ్‌లో ఓలా వేల్యుయేషన్‌ను తక్కువగా లెక్కగట్టినట్లుగా తెలుస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ పెట్టుబడులు గణనీయంగా ఉన్న ఈ కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌ను.. మరో కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించాలని సాఫ్ట్‌బ్యాంక్ యోచిస్తున్న తరుణంలో.. ఓలాలో ఇన్వెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికన్ ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ భారత్‌లో కార్యకలాపాలు పటిష్టం చేసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో గట్టి పోటీనిచ్చేందుకు ఓలా భారీగా నిధులు సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే.