ఇన్సెంటివ్‌లకు చెల్లుచీటీ..?
ప్రోత్సాహకాలు తగ్గించేస్తున్న ట్యాక్సీ అగ్రిగేటర్లు...
⇒ భవిష్యత్‌పై ఆందోళనలో కారు డ్రైవర్లు
⇒ పడిపోతున్న రోజువారీ ఆదాయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెలకు లక్షల్లో ఆదాయం. అదీ ఓ ట్యాక్సీ నడిపితే. ఇంకేముంది.. ఐటీ ఉద్యోగులూ తమ కంపెనీలకు బై బై చెప్పేసి కార్లు కొనుక్కున్నారు. మొదట్లో బాగానే ఉంది. ఇప్పుడే సీన్ రివర్స్ అయింది. ఇబ్బడిముబ్బడిగా ఇన్సెంటివ్‌ల ఆశజూపి యువతను ఆకట్టుకున్న ట్యాక్సీ అగ్రిగేటర్లు ఇప్పుడు తమ ప్రతాపాన్ని నెమ్మదిగా చూపిస్తున్నాయి. అదీ అందరూ ఊహించినట్టుగానే నగదు ప్రోత్సాహకాలను (ఇన్సెంటివ్‌లు) గణనీయంగా తగ్గించివేశాయి. మరోవైపు నిర్దేశిత ట్రిప్పుల సంఖ్యను పెంచాయి. డ్రైవర్లను పెట్టుకుని కార్లను నడుపుతున్న యజమానులకు మాత్రం ఈ పరిణామంతో చుక్కలు కనపడుతున్నాయి. నెల తిరిగితే చేతిలో చిల్లిగవ్వ ఉండడం లేదని కార్ల యజమానులు వాపోతున్నారు.
మారుతున్న పథకాలు..
కొన్ని నెలల క్రితం వరకు ఉబెర్ తన డ్రైవర్‌కు రూ.2,600ల వ్యాపారం చేస్తే.. కమీషన్ తగ్గించుకుని ఇన్సెంటివ్ రూపంలో రూ.1,300 చెల్లించేది. డీజిల్, డ్రైవర్ జీతం, ఈఎంఐ, నిర్వహణ ఖర్చులు రూ.2,700 పోను యజమానికి రోజుకు రూ.1,200 దాకా మిగిలేది. ఇప్పుడు బూస్ట్ ఇన్సెంటివ్స్ పేరుతో ఉబెర్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇన్సెంటివ్‌లను పూర్తిగా తొలగించింది. ఉదయం 6–10 మధ్య, సాయంత్రం 5–10 మధ్య ఒకటిన్నర రెట్ల వరకు చెల్లిస్తామని చెబుతోంది. అంటే డ్రైవర్ ఒక ట్రిప్‌కు రూ.100 సంపాదిస్తే, కంపెనీ రూ.50 జోడించి మొత్తం రూ.150 చెల్లిస్తుందన్న మాట.
ఇప్పుడు డ్రైవర్లు రోజుకు రూ.2 వేలు సంపాదించడమే గగనమవుతోంది. అంటే రూ.2 వేలు వస్తే కంపెనీ రూ.1,000 జత చేసినా మొత్తం దక్కేది రూ.3,000. రోజువారీ ఖర్చులు పోతే చేతికొచ్చేది రూ.300 మాత్రమే. లక్ష్య పేరుతో నాలుగు రోజుల గడువులో 44 ట్రిప్పులు చేస్తే రూ.1,700 ఇన్సెంటివ్ వస్తుంది. ఇక ఓలా గతంలో 16 బుకింగ్స్‌కు రూ.5,500 చెల్లించేది. ఇప్పుడు 18 ట్రిప్పుల కు రూ.5,000 ఇస్తోంది. ఇన్ని ట్రిప్పులు చేయలేక డ్రైవర్లు చేతులెత్తేస్తున్నారు. నిర్దేశిత ట్రిప్పులు చేస్తేనే ఓలా డ్రైవర్‌కు నగదు ప్రోత్సాహం లభిస్తుంది. లేదంటే కస్టమర్లు చెల్లించిన దానికే సరిపెట్టుకోవాలి.
సమస్యల్లా ట్రిప్పులే..
ప్రసుత్తం హైదరాబాద్‌లో ఒక ట్యాక్సీ 24 గంటల్లో సగటున 16 ట్రిప్పులు చేస్తోంది. కారు రోజువారీ సంపాదన రూ.2,000 మించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఇబ్బడిముబ్బడిగా ట్యాక్సీలుగా కొత్త కార్లు వచ్చి చేరుతుండడమే. ట్యాక్సీ కంపెనీలు ఔత్సాహిక యువతకు రుణం ఇప్పించి కారు యజమానిని చేస్తున్నాయి. మరి కొందరితో లీజు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. లీజు కాలం ముగిసిన తర్వాత కారును డ్రైవర్ పేరుకు బదలాయిస్తారు. భాగ్యనగరిలో రోజుకు ఎంత కాదన్నా 200 దాకా కార్లు నమోదవుతున్నాయని రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇలా కొత్తగా వచ్చిన కార్లకే బుకింగ్‌లను ఎక్కువగా ఇస్తున్నాయని చాలా మంది పాత డ్రైవర్లు రోడ్డెక్కి నిరసన, ఆందోళనలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అయినప్పటికీ కంపెనీలు కొత్త కార్లను నమోదు చేస్తూనే ఉన్నాయి.