కాల్ డ్రాప్స్‌పై ప్రధాని సీరియస్
తక్షణమే పరిష్కరించాలని ఆదేశం
న్యూఢిల్లీ: ఫోన్ రింగొస్తుంది. ఎత్తేసరికి అవతలి గొంతు వినిపించదు. మళ్లీ చేయాల్సిందే..! మరికొన్ని సందర్భాల్లో మాట్లాడుతుండగానే ఫోన్ కట్ అవుతుంది. మళ్లీ చేయాల్సిందే...! టెలికామ్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇలాంటి కాల్‌డ్రాప్ సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. సామాన్యులపై ప్రభావం చూపే ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కాల్ డ్రాప్ సమస్య డేటా కనెక్టివిటీకి కూడా విస్తరించే ప్రమాదం ఉందని, అలా జరగకుండా చూడాలని సూచించారు. డిజిటల్, గ్రామీణ మౌలిక సదుపాయాలు మొదలైన అంశాల పురోగతిని సమీక్షించిన మోదీ.. ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు మంగళవారం ప్రధాని కార్యాలయం తెలియజేసింది. ‘‘కాల్ డ్రాప్ సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై అధికారుల్ని మోదీ ప్రశ్నించారు.
మారుమూల ప్రాంతాలకూ మొబైల్ కనెక్టివిటీ విస్తరించేలా రైల్వే, ఇతర కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను సమర్ధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. 1,000 రోజుల్లోగా దేశంలోని అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రతిపాదనను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు లక్ష్యాలుండాలని చెప్పారు’’ అని ఆ ప్రకనటనలో వివరించారు. ప్రభుత్వం తగినంత స్పెక్ట్రం ఇవ్వకపోవడం వల్ల కాల్ డ్రాప్స్‌ను అడ్డుకోలేకపోతున్నామని, సేవలు మెరుగుపర్చలేకపోతున్నామని టెల్కోలు ఆరోపిస్తున్నాయి.
అయితే టెలికం కంపెనీలు తగినంత ఇన్వెస్ట్ చేయకపోవడం వల్లే ఈ సమస్య వస్తోందంటూ కేంద్రం చెబుతోంది. కాగా కాల్ డ్రాపింగ్ సమస్య పరిష్కరించేందుకు మొబైల్ ఆపరేటర్లు నెట్‌వర్క్‌ను మెరుగుపర్చుకోవాలని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ సూచిం చారు. ఇందుకోసం టవర్ల ఏర్పాటు, రేడియేషన్ భయాల తొలగింపు తదితర అంశాలన్నింటికి సంబంధించి విధానాలపరంగా ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని దక్షిణాసియా టెలికం రంగ నియంత్రణ మండలి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు.