న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ఆరంభమైన జన్‌ధన్ యోజన పథకం ఓ రికార్డును చేరుకుంది. ఈ పథకం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో సామాన్యుల డిపాజిట్లు రూ.లక్ష కోట్ల మార్కును చేరాయి. జూలై 3 నాటికి ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) కింద 36.06 కోట్ల ఖాతాల్లోని మొత్తం డిపాజిట్లు రూ.1,00,495.94 కోట్లుగా ఉన్నట్టు ఆర్థిక శాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ 6 నాటికి ఈ డిపాజిట్లు రూ.99,649.84 కోట్లుగా ఉండగా, క్రమంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. పీఎంజేడీవై పథకాన్ని మోదీ సర్కారు తొలిసారి కేంద్రంలో కొలువు దీరిన సంవత్సరం 2014 ఆగస్ట్ 28న ప్రారంభించిన విషయం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ బ్యాంకు సేవలను అందించడమే దీని ఉద్దేశ్యం. ఇవన్నీ జీరో బ్యాలన్స్ సదుపాయంతో కూడిన బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలు. ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డుతోపాటు, బ్యాలన్స్ లేకపోయినా రూ.5 వేల ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment